
- షిప్పింగ్, రైల్వే షేర్లతో కాసుల వర్షం
- మజగాన్ డాక్ షేర్లు 3,700 శాతం అప్
న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్లలో మార్కెట్‌లో లిస్టింగ్ అయిన ప్రభుత్వం కంపెనీలు ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలిచ్చాయి. ఈ టైమ్‌లో మొత్తం 18 ప్రభుత్వ కంపెనీలు లిస్ట్ అవ్వగా, ఇందులో 15 కంపెనీలు భారీ రిటర్న్‌లను ఇచ్చాయి. మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ షేర్లయితే ఐపీఓ ధర కంటే 3,700 శాతం పెరగడం విశేషం. మే 2017 తర్వాత లిస్ట్ అయిన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్‌ఈలు)లు, ముఖ్యంగా షిప్పింగ్, రైల్వే కంపెనీలు ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాలిచ్చాయి.
మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్), గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) షేర్లు తమ ఐపీఓ ధరతో పోలిస్తే 1,000 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. మజగాన్ డాక్ షేర్లు 2020లో మార్కెట్‌లో చేరగా, షేరు ధర రూ. 145 వద్ద ఐపీఓలో ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. కిందటేడాది డిసెంబర్‌లో స్టాక్ స్ప్లిట్ చేపట్టింది.
అయినప్పటికీ కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ. 2,642 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ రూ. 118 ఇష్యూ ధరతో 2018లో మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. ప్రస్తుతం షేర్లు ఒక్కోటి రూ. 1,616 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇన్వెస్టర్లకు 1,369 శాతం రిటర్న్ వచ్చింది. ఆర్‌వీఎన్‌ఎల్ 2019 లో మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. ఐపీఓ ఇష్యూ ధర రూ. 19 కాగా, ప్రస్తుతం రూ. 360 కి పెరిగింది. 1,866 శాతం రిటర్న్ ఇచ్చింది.
రైల్వే, డిఫెన్స్ జూమ్
ఐఆర్‌సీటీసీ షేర్లు1,110 శాతం రిటర్న్ (స్టాక్‌స్ల్పిట్‌కు ముందు ధరతో పోలిస్తే ) ఇవ్వగా, ఆర్‌ఐటీఈఎస్, ఐఆర్‌సీఓఎన్ ఇంటర్నేషనల్ షేర్లు వరుసగా 225 శాతం, 243 శాతం లాభపడ్డాయి. 2021లో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైల్‌టెల్ ఇన్వెస్టర్లకు 238 శాతం లాభాలనిచ్చింది. రక్షణ రంగంలోని కంపెనీలు - హిందుస్థాన్ ఏరోనాటిక్స్ (హెచ్‌ఏఎల్, 605 శాతం లాభం), భారత్ డైనమిక్స్ (బీడీఎల్, 558 శాతం లాభం), మిధాని (227 శాతం లాభం) కూడా ఐపీఓ ధరతో పోలిస్తే భారీగా పెరిగాయి.
2023లో రూ. 32 ఇష్యూ ధరతో ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) షేర్లు 458 శాతం పెరిగి ఒక్కో షేరు రూ. 167 కు చేరాయి. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) 2017లోని రూ. 60 ఇష్యూ ధర నుంచి రూ. 233కు పెరిగి పెట్టుబడిదారులకు 288 శాతం రిటర్న్‌ను ఇచ్చింది. స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న ఎంఎస్‌టీసీ, రూ. 120 ఇష్యూ ధర నుంచి రూ. 540.25కు పెరిగి పెట్టుబడిదారులకు 350 శాతం రిటర్న్‌ను ఇచ్చింది. మరోవైపు న్యూ ఇండియా అస్యూరెన్స్, ఎల్‌ఐసీ, జీఐసీ షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి.