బుమ్రా గాయాలకు బౌలింగ్‌‌ యాక్షనే కారణం..

బుమ్రా గాయాలకు బౌలింగ్‌‌ యాక్షనే కారణం..
  • ఎడమ వైపు ఎక్కువగా వంగడం వల్ల వెన్నుపై ఒత్తిడి
  • బుమ్రా గాయాలకు ఇదే ప్రధాన కారణం

‘హ్యాండిల్‌‌ విత్‌‌ కేర్‌‌’.. ప్రస్తుతం టీమిండియా స్పీడ్‌‌స్టర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు ఈ ట్యాగ్‌‌లైన్‌‌ సరిగ్గా సరిపోతుంది. అతను వరుసగా మ్యాచ్‌‌లు ఆడినా.. ఎక్కువ ఓవర్లు బౌలింగ్‌‌ చేసినా కచ్చితంగా విశ్రాంతి ఇవ్వాల్సిందే. లేదంటే ఏదో ఓ గాయంతో నెలల తరబడి క్రికెట్‌‌కు దూరమవుతాడు. ప్రపంచంలో ఏ బౌలర్‌‌కు లేని ఈ సమస్య ఒక్క బుమ్రాకే ఎందుకు? తరచుగా అతను గాయాలబారిన పడటానికి గల కారణాలేమిటి? బుమ్రా విషయంలో వర్క్‌‌ లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ ఎందుకు కీలకం? వీటన్నింటికి ప్రధాన కారణం.. బుమ్రా అసాధారణ బౌలింగ్‌‌ యాక్షనే. 

ఫిట్‌‌నెస్‌‌ సమస్యలు లేకపోయినా.. తన బాడీ అసాధారణమైన బయో మెకానికల్‌‌ శైలి వల్ల అధికమైన ఒత్తిడిని ఎదుర్కొవాల్సి వస్తోంది. దీన్ని లెజెండరీ క్రికెటర్లు సునీల్‌‌ గావస్కర్‌‌, దిలీప్‌‌ వెంగ్‌‌సర్కార్‌‌లాంటి వాళ్లు అర్థం చేసుకోలేకపోవడం దురదృష్టకరం. ఈ క్రమంలోనే వాళ్లు వర్క్‌‌ లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో బుమ్రాపై విమర్శనాస్త్రాలు మొదలయ్యాయి. వాస్తవంగా బుమ్రాకు ఎలాంటి ఫిట్‌‌నెస్‌‌, అనారోగ్య సమస్యలు లేవు. కానీ బుమ్రా శరీర నిర్మాణాన్ని బట్టి వచ్చిన మార్పులతో బౌలింగ్‌‌ యాక్షన్‌‌  అతనికి ప్రమాదకరంగా మారి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

వీపుపై తీవ్రమైన ఒత్తిడి..

ముఖ్యంగా ఫాస్ట్‌‌ బౌలర్లను రెండు వర్గాలుగా విభజిస్తారు. ఒకటి మోకాలి డామినెంట్‌‌.. రెండోది హిప్‌‌ (నడుం) డామినెంట్‌‌. హిప్‌‌ డామిమెంట్‌‌ బౌలర్లు చిన్న రనప్‌‌తో అత్యధిక వేగాన్ని, మూమెంటమ్‌‌ను రాబడతారు. కండరాల బలంపై ఏమాత్రం ఆధారపడరు. మోకాలి డామినెంట్‌‌ బౌలర్లు ప్రధానంగా కండరాల బలం నుంచి వేగాన్ని రాబడతారు.  అయితే బుమ్రా ఫ్రంట్‌‌ యాక్షన్‌‌తో కూడిన హిప్‌‌ డామినెంట్‌‌ బౌలర్‌‌. క్రీజును సమీపించేటప్పుడు ఎక్కువ రనప్‌‌తో కూడిన లాంగ్‌‌ మూమెంటమ్‌‌ ఇతనికి ఉండదు. రెండు, మూడు అడుగులతో బౌలింగ్‌‌ మొదలుపెట్టి షార్ట్‌‌ రనప్‌‌తో తడబడుతున్న యాక్షన్‌‌తో బౌలింగ్‌‌ మొదలుపెడతాడు. కాబట్టి క్రీజును సమీపించేటప్పడు బుమ్రాకు ఎక్కువ మూమెంటం ఉండదు. 

ఫాస్ట్‌‌ బౌలర్లలో ఇది అసాధారణమైన చర్య. అంటే అనుకున్న పేస్‌‌ను రాబట్టేందుకు రనప్‌‌పై ఆధారపడడు. కేవలం స్టెప్స్‌‌, ఫ్రంట్‌‌ లెగ్‌‌పై నిలబడి ఆర్మ్‌‌ రొటేషన్‌‌తో పాటు మోచేయి ఎక్కువగా వంచుతూ మణికట్టును ఎక్కువగా ఉపయోగిస్తాడు. బాల్‌‌ను ఫ్రంట్‌‌ ఫుల్‌‌ లైన్‌‌పై డెలివరీ చేసేటప్పుడు తన శరీర పైభాగాన్ని ఇతరుల కంటే ఎక్కువగా ఎడమ వైపు వంచుతాడు. ఈ అంశాల వల్ల బుమ్రా వేసే బాల్‌‌ చాలా పదునుగా లోపలికి చొచ్చుకుపోతుంది. కానీ అదే టైమ్‌‌లో అతని వీపుపై అపారమైన ఒత్తిడి పడుతుంది. ఫలితంగా బుమ్రా స్ట్రెస్‌‌ ఫ్రాక్చర్‌‌ వంటి గాయాలకు ఎక్కువగా గురి అవుతున్నాడు.

లెక్కలు అబద్దం చెప్పవు..

వెన్ను గాయం, సర్జరీ తర్వాత 2023 డిసెంబర్‌‌ నుంచి బుమ్రా టెస్ట్‌‌ల్లో 513.2 ఓవర్లు వేశాడు. వన్డేల్లో 128.5, టీ20ల్లో 37.4, ఐపీఎల్‌‌లో 99.1 ఓవర్లు బౌలింగ్‌‌ చేశాడు. సర్జరీ తర్వాత ఇంతగా బౌలింగ్‌‌ చేయడం అతన్ని మరింత ఆందోళనలో పడేస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు సిరీస్‌‌లనే పరిగణనలోకి తీసుకుంటే.. ఇవి మరింత దారుణంగా ఉన్నాయి. 2018–19 బోర్డర్‌‌–గావస్కర్‌‌ ట్రోఫీ (బీజీటీ)లో బుమ్రా నాలుగు టెస్ట్‌‌ల్లో కలిపి 157 ఓవర్లు వేశాడు. 2024–25 సిరీస్‌‌లో నాలుగున్నర టెస్ట్‌‌ల్లో కలిపి 151.2 ఓవర్లు బౌలింగ్‌‌ చేశాడు. అంతే ఐదో టెస్ట్‌‌ మధ్యలోనే వెన్ను నొప్పితో ఆటకు దూరమయ్యాడు. 

2018–19 బీజీటీలో బుమ్రా 21 వికెట్లు తీస్తే, సిరాజ్‌‌ 136.4 ఓవర్లు వేసి 16 వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌‌ శర్మ మూడు టెస్ట్‌‌ల్లో 103 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టెస్ట్‌‌ ఆడిన ఉమేశ్‌‌ యాదవ్‌‌ 37 ఓవర్లు వేశాడు. 40 ఓవర్లు బౌలింగ్‌‌ చేసిన ఇతర సీమర్లలో ఆకాశ్‌‌ దీప్‌‌ (2 టెస్ట్‌‌లు, 77.5 ఓవర్లు, 5 వికెట్లు), నితీశ్‌‌ కుమార్‌‌ రెడ్డి (44 ఓవర్లు , 5 వికెట్లు) కూడా ఉన్నారు. కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దాంతో కెప్టెన్లు తరచుగా బుమ్రాపై ఎక్కువగా ఆధారపడ్డారు. 

దీనివల్ల అతనికి స్పెల్స్‌‌ మధ్య కోలుకునే సమయం కూడా చాలా తక్కువగా ఉండేది. ఈ పని భారమే అతని శరీరంపై తీవ్ర ఒత్తిడిని చూపింది. ఇటీవల ముగిసిన అండర్సన్‌‌–టెండూల్కర్‌‌ ట్రోఫీలో ఇండియా ఐదు టెస్ట్‌‌లు ఆడింది. ఇందులో టెయిలెండర్లలో బ్యాటర్ల సంఖ్యను పెంచేందుకు ఓ ఫాస్ట్‌‌ బౌలర్‌‌ను తక్కువగా ఆడించింది. దీనివల్ల బుమ్రా, సిరాజ్‌‌పై అత్యధిక భారం పడింది. బుమ్రా ఐదింటిలో మూడు మ్యాచ్‌‌లే ఆడినా 119.4 ఓవర్లు వేశాడు. అంటే ఇన్నింగ్స్‌‌కు 30 ఓవర్లు బౌలింగ్‌‌ చేశాడు. 2024 నుంచి 2920 బాల్స్‌‌ వేసిన బుమ్రా అనుకున్న దానికంటే ఎక్కువగానే వికెట్లు తీశాడు. 

కాబట్టి అతను ఎన్ని మ్యాచ్‌‌లు ఆడతాడు అనేది మాత్రమే కాదు.. మ్యాచ్‌‌లో ఎన్ని ఓవర్లు బౌలింగ్‌‌ చేస్తాడు అనేది కూడా చాలా ముఖ్యం. ఈ గణాంకాలను చూసుకుంటే ప్రతి మ్యాచ్‌‌లో బుమ్రా చాలా స్పష్టమైన సంఖ్యలో బౌలింగ్ చేశాడు. వికెట్లూ తీశాడు. 8 ఏండ్ల టెస్ట్‌‌ కెరీర్‌‌లో బుమ్రా ఇప్పటికే మూడుసార్లు వెన్ను గాయాలకు గురయ్యాడు. వయసు కూడా 31 ఏళ్లు. గాయపడితే భవిష్యత్‌‌లో కోలుకోవడానికి మరింత టైమ్‌‌ పడుతుంది. కాబట్టి వర్క్‌‌ లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌తో కాపాడుకుంటారా? లేక ఏదైనా ఒకటే ఫార్మాట్‌‌కు పరిమితం చేస్తారా? చూడాలి. ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే మాత్రం కెరీర్ ప్రమాదంలో  పడొచ్చు.