బాధితుల గోడు విని ఏడ్చిన ఐఏఎస్

బాధితుల గోడు విని ఏడ్చిన ఐఏఎస్

ఆమె ఒక ఐఏఎస్ అధికారిణి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఈక్రమంలో గాయాలతో  చికిత్సపొందుతున్న ఓ పిల్లవాడి తల్లితో మాట్లాడే క్రమంలో ఆమె భావోద్వేగం కట్టలు తెంచుకుంది. కన్నీటిపర్యంతమయ్యారు. ప్రజలతో ఎమోషనల్ అటాచ్మెంట్ ను పెంచుకొని.. వారి కష్టాలను తన కష్టాలను భావిస్తున్న ఆ అధికారిణి పేరు రోషన్ జాకబ్. ఆమె లఖీంపూర్ ఖేరీ డివిజనల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. 

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీలో ఐరా వంతెనపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి. ఎదురుగా  వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో 41 మంది గాయాలపాలు కాగా, 10 మంది చనిపోయారు. గాయపడ్డ వాళ్లలో 12 మందిని లక్నోలోని ఒక ట్రామా కేర్ సెంటర్ కు పంపారు. ఇంకొంత మందికి లక్నో జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  

ఈ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్న వారిని లక్నో డివిజనల్ కమిషనర్ రోషన్ జాకబ్ పరామర్శించారు.  చికిత్సపొందుతున్న ఓ పిల్లవాడి తల్లితో మాట్లాడే క్రమంలో.. రోషన్ జాకబ్ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతి మృతుడి కుటుంబానికి రూ.2 లక్షలు చొప్పున ప్రభుత్వ ఆర్థికసాయాన్ని అందిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.