నది మధ్యలో తిరగబడిన బస్సు.. అరచేతిలో 27 ప్రాణాలు!

నది మధ్యలో తిరగబడిన బస్సు.. అరచేతిలో 27 ప్రాణాలు!

ఉత్తర భారతదేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. వేలసంఖ్యలో నిరాశ్రయులు కాగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే.. వరదనీటిని దాటాలన్నా ఉత్సాహం 27 మంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది.

పై రాష్ట్రాలలో కురుస్తున్న ఎడతెరిపినలేని వ‌ర్షాల‌కు య‌మునా న‌ది పొంగిపొర్లుతోంది. అయినప్పటికీ ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటం లేదు. ప్రాణాలకు తెగించి వరద నీటిని దాటుతూ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి హర్యానాకు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు నది మధ్యలోనే తిరగబడింది. అంబాలా-య‌మునాన‌గ‌ర్ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అందులోని ప్రయాణికులు తమ ప్రాణాలు రక్షించుకోవటానికి బస్సు పైభాగానికి ఎక్కారు.

వరద నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుడంతో వారు తమ ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈలోపు స్థానికులు రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఓ భారీ క్రేన్‌ సాయంతో వారిని కాపాడగలిగారు. మొత్తం 27 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

#Watch | Bus Overturns In Flooded #Haryana's Ambala, 27 Rescued Using Crane pic.twitter.com/raEM2U494T

— NDTV (@ndtv) July 10, 2023