రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది మరణించగా... అందులో ఎనిమిదిమంది చిన్నారులు ఉన్నారు.మృతదేహాలను బారీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. శనివారం ( అక్టోబర్ 19) రాత్రి సునిపూర్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కరౌలి-ధోల్‌పూర్ హైవేపై ప్రైవేట్ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు .. టెంపోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు .గాయపడిన వారిలో బస్సు ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్‌లు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన రెండు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ధోల్‌పూర్ ప్రమాదంలో మృతులను పోలీసులు గుర్తిస్తున్నారు.
ధోల్‌పూర్ జిల్లాలోని బారీ గ్రామానికి చెందిన కరీం కాలనీకి చెందిన నహ్ను, జహీర్‌ల కుటుంబ సభ్యులు... బరౌలి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి ఓ శుభ కార్యానికి వెళ్లారని.. బారీ కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తెలిపారు. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ బారీ నగరంలోని గుమత్ మొహల్లా ప్రాంతానికి చెందిన వారు. ఈ ప్రమాదంలో బస్సు కూడా దెబ్బతింది. పోలీసులు బస్సు, టెంపోలను సీజ్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు టెంపోలో గాఢ నిద్రలో ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగంతో వచ్చి ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.