చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం బొర్రలగూడెం దగ్గర తెల్లవారు జామున ప్రేమ్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి క్రాస్ సమీపంలో జరిగిన ప్రమాదం విషాదం నింపింది. బొలెరో వాహనాన్ని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఒకరు చనిపోగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
ఎస్సై జగదీశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్పరిధి సోమ్లాతండా, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి, పర్వతగిరి మండలం అన్నారం గ్రామాలకు చెందిన 16 మంది కలిసి తమ బంధువు అస్థికలు గోదావరిలో కలిపేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయం తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలోకి రాగానే హన్మకొండ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సూపర్‌లగ్జరీ బస్సు బొలెరో వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో బొలెరోలో ఉన్న పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని 108లో ములుగు జిల్లా హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అన్నారం గ్రామానికి చెందిన ధరావత్భద్రు (45) చనిపోయినట్లు నిర్ధారించారు. గాయపడిన వణితి, భూక్య యాకు, కైక, నేహా తదితరులకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
