ట్రంప్ మళ్లీ అదే పాత పాట: ఇద్దరూ కోరితే కశ్మీర్ పై మధ్యవర్తిత్వం

ట్రంప్ మళ్లీ అదే పాత పాట: ఇద్దరూ కోరితే కశ్మీర్ పై మధ్యవర్తిత్వం

న్యూయార్క్: నిన్న ప్రధాని మోడీతో దోస్త్.. మేరా దోస్త్ అంటూ కనిపించాడు. కానీ నేడు కశ్మీర్ విషయంలో మళ్లీ అదే పాత పాట పాడుతున్నాడు. ఇప్పటికి మధ్యవర్తిత్వానికి రెడీ అంటూ ప్రకటన చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ – పాక్ మధ్య తాను పెద్ద మనిషిగా ఉంటానని చెప్పారాయన. మంగళవారం ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే ముందు.. యూన్ భవనం వద్ద మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు తాను ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నానన్నారు. అయితే ఇరు దేశాల ప్రధానులు కోరుకుంటేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ చెప్పారు. కానీ భారత్, పాక్ ల ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వివరించారు. వీలైనంత మేరకు తాను సాయం చేసేందుకు సిద్ధమన్నారు.

ట్రంప్ తో ఇవాళ జరిగిన సమావేశంలోనూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మధ్యవర్తిత్వం కోరుకున్నారు. అయితే ఆ భేటీలోనూ ఇమ్రాన్ కు తాను ఇదే విషయం చెప్పానన్నారు ట్రంప్. కశ్మీర్ అంశం చాలా క్లిష్టమైన విషయమని, ఇద్దరూ కోరుకుంటేనే తాను సాయం చేయగలనని స్పష్టం చేశారు. ఇద్దరిలో ఏ ఒకరు లేకపోయినా ఇది సాధ్యం కాదన్నారు.

మరికొద్ది గంటల్లోనే మోడీతో భేటీ

యూఎన్ లో ట్రంప్ ప్రసంగం తర్వాత కొద్ది గంటల్లొ ప్రధాని నరేంద్ర మోడీతో ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి మధ్యవర్తిత్వం వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్నహౌడీ మోడీ కార్యక్రమంలో చేతిలో చేయేసి నడిచి.. ఇవాళ ఇమ్రాన్ తో మీటింగ్ తర్వాత మళ్లీ పాక్ మాటలు మట్లాడడంపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.