మంచి డ్రైవింగ్ ట్రాక్ రికార్డ్ ఉన్న కారు యజమానులకు మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే అద్భుతమైన బహుమతి 'నో-క్లెయిమ్ బోనస్'. అయితే కొత్త కారు కొనేటప్పుడు పాత కారుకు ఉన్న ఎన్‌సీబీని బదిలీ చేయడం ద్వారా ఇన్సూరెన్స్ ప్రీమియంపై భారీగా డబ్బు ఆదా చేసుకోవచ్చనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అవును వరుసగా 5 ఏళ్లపాటు ఎలాంటి క్లెయిమ్ చేసుకోని వాహనదారులు తమ కొత్త కారు 'ఓన్ డ్యామేజ్' ప్రీమియంపై గరిష్టంగా 50% వరకు డిస్కౌంట్ పొందవచ్చు తెలుసా.
చాలామంది పాత కారును అమ్మేసేటప్పుడు ఈ బోనస్‌ను వదిలేస్తుంటారు. కానీ ఎన్‌సీబీ అనేది వాహనానికి కాదు, వాహన యజమానికి లింక్ అయి ఉంటుందని గమనించాలి. కాబట్టి పాత కారును అమ్మే ముందే ఈ ప్రయోజనాన్ని సురక్షితంగా దాచుకోవాలని పాలసీబజార్ మోటార్ ఇన్సూరెన్స్ హెడ్ పారస్ పస్రిచా సూచిస్తున్నారు.
ఎన్‌సీబీ బోనస్ ఎలా పెరుగుతుంది?
యాక్సిడెంట్ క్లెయిమ్‌లు చేయని ప్రతి సంవత్సరానికి ఈ డిస్కౌంట్ శాతం క్రమంగా పెరుగుతూ వెళ్తుంది:
* మొదటి క్లెయిమ్ రహిత సంవత్సరం తర్వాత: 20% డిస్కౌంట్
* రెండవ సంవత్సరం తర్వాత: 25% డిస్కౌంట్
* మూడవ సంవత్సరం తర్వాత: 35% డిస్కౌంట్
* నాల్గవ సంవత్సరం తర్వాత: 45% డిస్కౌంట్
* ఐదు సంవత్సరాల తర్వాత: 50% డిస్కౌంట్
ఈ 50% అనేది గరిష్ట పరిమితి. అయితే ఈ డిస్కౌంట్ కేవలం 'ఓన్ డ్యామేజ్' ప్రీమియంకు మాత్రమే వర్తిస్తుంది. తప్పనిసరి థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంకు మాత్రం వర్తించదని గుర్తుంచుకోండి.
ఎన్‌సీబీని కొత్త కారుకు ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి?
పాత కారు అమ్మిన తర్వాత, పాలసీదారుడు ప్రస్తుత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 'NCB రిటెన్షన్' లేదా 'ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్' కోసం అప్లై చేసుకోవాలి. ఇది మీ బోనస్‌కు సాక్ష్యం లాగా పనిచేస్తుంది. ఒకే రకమైన వాహనాల మధ్య మాత్రమే ఈ బదిలీ సాధ్యమవుతుంది. అంటే కారు నుంచి మరో కారుకు లేదంటే టూ-వీలర్ నుంచి మరో టూ-వీలర్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందనమాట. ఇందులో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనం అనే తేడాలు లేకుండా.. అన్నింటికీ బదిలీ చేసుకోవచ్చు. కొత్త కారుకు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ సర్టిఫికెట్‌ను సమర్పిస్తే డిస్కౌంట్ వస్తుందన్నమాట.
ఈ నో క్లెయిమ్ బోనస్ రిటెన్షన్ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుంచి 3 ఏళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. పాత కారు అమ్మిన వెంటనే కొత్త కారు కొనకపోయినా.. ఈ మూడేళ్ల గ్యాప్‌లో ఎప్పుడు కొన్నా పాత బోనస్‌ను వాడుకోవచ్చు. కొత్త కారు కోసం వేరే ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకున్నప్పటికీ ఈ సర్టిఫికేట్ చెల్లుతుందని గుర్తుంచుకోండి. అయితే 3 ఏళ్లు దాటితే మాత్రం ఈ బెనిఫిట్ రద్దయిపోతుంది. మళ్లీ మొదటి నుంచి బోనస్ సంపాదించుకోవాల్సి ఉంటుంది.
పాత కారు కొన్న వ్యక్తి చేయాల్సిన పని..
కారును అమ్మేసిన వ్యక్తి ఎన్‌సీబీ సర్టిఫికేట్ తన వద్ద ఉంచుకున్నప్పటికీ.. పాత కారును కొనుక్కున్న న్యూ ఓనర్ పేరు మీదకు ఇన్సూరెన్స్‌ను 14 రోజుల్లోపు బదిలీ చేయాలి. దీనికోసం ఆర్సీ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్లను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించాల్సి ఉంటుంది. వాహనం అమ్మిన తర్వాత లీగల్ సమస్యలు రాకుండా ఉండటానికి, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కవరేజ్ నిరంతరాయంగా కొనసాగడానికి ఇది చాలా ముఖ్యం.
