బ్రాంజ్‌‌తో సరి..సెమీస్‌‌లో ఓడిన ప్రణయ్‌‌

బ్రాంజ్‌‌తో సరి..సెమీస్‌‌లో ఓడిన ప్రణయ్‌‌

కోపెన్‌‌హాగెన్‌‌: వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ విక్టర్‌‌ అక్సెల్సెన్‌‌కు షాకిచ్చి సంచలనం రేకెత్తించిన ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ హెచ్‌‌ఎస్‌‌ ప్రణయ్‌‌ అదే జోరు కొనసాగించలేకపోయాడు. బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌తో సరి పెట్టాడు. సెమీస్‌‌లో తొలి గేమ్ నెగ్గినా తర్వాత తడబడి చేజేతులా ఓడిపోయాడు.  శనివారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీఫైనల్లో  తొమ్మిదో సీడ్‌‌ ప్రణయ్‌‌ 21–18, 13–21, 14–21తో మూడో ర్యాంకర్​ కున్లావుట్‌‌ విటిడ్‌‌సార్న్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో మూడు గేమ్స్‌‌ పాటు పోరాడి ఓడిపోయాడు. దాంతో మెగా టోర్నీలో గోల్డ్‌‌ నెగ్గాలన్న ప్రణయ్‌‌ కల నెరవేరకుండా పోయింది. సెమీస్‌‌ ఓటమితో అతను  బ్రాంజ్‌‌ మెడల్‌‌తో సంతృప్తి చెందాడు. ఈ టోర్నీలో అతనికిదే తొలి మెడల్‌‌. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో ఇండియాకు ఇది 14వ మెడల్‌‌. కాగా, ప్రణయ్‌‌ ఓటమితో ఈ ఎడిషన్‌‌లో ఇండియా పోరాటం ముగిసింది. సింధు, శ్రీకాంత్‌‌, లక్ష్యసేన్‌‌ ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగ్గా.. డబుల్స్‌‌లో టైటిల్‌‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగిన సాత్విక్‌‌–చిరాగ్‌‌ క్వార్టర్ ఫైనల్లోనే ఓడారు. 

చేజేతులా..

మెగా టోర్నీలో చాలా ప్రయత్నాల తర్వాత తొలిసారి సెమీస్‌‌కు వచ్చిన ప్రణయ్‌‌ అనూహ్యంగా తడబడ్డాడు. క్వార్టర్స్‌‌లో ఒలింపిక్‌‌ చాంప్‌‌ విక్టర్‌‌పై అద్భుతంగా ఆడిన కేరళ షట్లర్‌‌ అదే రిజల్ట్‌‌ను రిపీట్‌‌ చేయలేకపోయాడు. గత రెండు మ్యాచ్​ల్లోనూ మూడేసి గేమ్స్​ ఆడటంతో అతను అలసిపోయాడు. కున్లావుట్​ బలమైన డిఫెన్స్​, ఎటాక్​ ముందు నిలవలేకపోయాడు. వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌‌ ఆరంభించిన ప్రణయ్‌‌ ప్రత్యర్థి తప్పిదాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాడు. 4–4తో స్కోరు సమమైన దశలో వరుసగా ఏడు పాయింట్లతో 11–4తో బ్రేక్‌‌కు వెళ్లాడు. ఆ తర్వాత కూడా కున్లావుట్‌‌ మిస్టేక్స్‌‌ కొనసాగించగా.. నాణ్యమైన షాట్లు ఆడిన ప్రణయ్‌‌ సులువుగానే గేమ్‌‌ నెగ్గాడు. రెండో గేమ్‌‌ను కూడా 4–0తో  మెరుగ్గానే ప్రారంభించాడు. కానీ, లయ అందుకున్న థాయ్‌‌ షట్లర్‌‌ వెంటనే 6–6తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి అతను టాప్‌‌ గేర్‌‌లోకి వచ్చేశాడు. 

వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి ముందంజ వేశాడు. బ్రేక్‌‌ తర్వాత ప్రణయ్‌‌ 12–15తో  పుంజుకునే ప్రయత్నం చేశాడు. కానీ, మరోసారి రెచ్చిపోయిన కున్లావుట్‌‌ వరుసగా ఆరు పాయింట్లతో రెండో గేమ్‌‌ నెగ్గి మ్యాచ్‌‌లో నిలిచాడు. ఇక, మూడో గేమ్‌‌ ఆరంభంలోనే 1–5తో వెనుకబడ్డ ఇండియా ప్లేయర్‌‌ డీలా పడిపోయాడు. ఓ జంప్‌‌ స్మాష్‌‌ కొట్టిన ప్రణయ్‌‌.. ప్రత్యర్థి వైడ్‌‌ షాట్‌‌తో మరో పాయింట్‌‌ నెగ్గి 6–8తో రేసులోకి వచ్చినట్టు కనిపించాడు. కానీ, వరుసగా నాలుగు పాయింట్లతో విటిడ్‌‌సార్న్‌‌ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. ప్రణయ్‌‌ కొన్ని బలమైన స్మాష్‌‌లు కొట్టినా ఫలితం లేకపోయింది. అతను కొట్టిన ఓ స్మాష్‌‌ లైన్‌‌ అవతల పడటంతో విటిడ్‌‌సార్న్‌‌ మ్యాచ్‌‌ గెలిచి ఫైనల్‌‌ చేరుకున్నాడు.