
- మెదక్ పట్టణం వద్ద బైపాస్ రోడ్డు కు ప్లాన్
మెదక్, వెలుగు: హైదరాబాద్ శివారు గండి మైసమ్మ నుంచి మెదక్ వరకు టూ లేన్ గా ఉన్న నేషనల్ హైవే 675డి ని ఫోర్ లేన్ గా విస్తరించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులకు ఆమోదం వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ ప్రకటించారు. హైవే విస్తరణ, బైపాస్ రోడ్డుకు ఆమోదం లభించి, నిధులు మంజూరు అయితే ప్రమాదాలకు చెక్ పడనుంది.
హైదరాబాద్ లోని బాలానగర్నుంచి వయా నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు ఉన్న రోడ్డు స్టేట్‌హైవే 6గా ఉండేది. మెదక్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉండటం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, బాన్సువాడ డిపోల ఆర్టీసీ బస్సులు ఎక్కువ శాతం ఈ రూట్లోనే రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ రోడ్డును 2017లో నేషనల్ హైవేగా గుర్తించింది. స్టేట్‌హైవేగా ఉన్న ఈ రోడ్డును బాలానగర్ నుంచి మెదక్ పట్టణం వరకు నేషనల్ హైవేగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి 765 డి నెంబర్కేటాయించింది.
హైవేకు రూ. 320 కోట్లు మంజూరు కాగా 2018లో బాలానగర్ నుంచి మెదక్ వరకు కిలోమీటర్ల దూరం హైవే రోడ్డు నిర్మాణ పనులు మొదలై 2020లో పూర్తయ్యాయి. ఈ రూట్‌లో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వరకు, ఆ తర్వాత నర్సాపూర్ పట్టణం, కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేట, మండల కేంద్రమైన కౌడిపల్లి, కొల్చారం, అప్పాజిపల్లి, పోతంశెట్ పల్లి చౌరస్తా, మెదక్ మండలం మంబోజిపల్లి వద్ద మాత్రమే ఫోర్ లైన్ రోడ్డు నిర్మించి, మధ్యలో డివైడర్, ఇరువైపులా డ్రైనేజీ నిర్మించి రెయిలింగ్ ఏర్పాటు చేశారు. మిగతా రోడ్డు మొత్తం టూ లేన్ రోడ్డుగానే నిర్మించారు. గుమ్మడిదల నుంచి నర్సాపూర్వరకు మూల మలుపులు ఉన్నప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతి లేదని రెండు వరుసలుగానే రోడ్డు నిర్మించారు.
రద్దీ పెరిగి అనేక ప్రమాదాలు
నేషషనల్ హైవే రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ఐదేళ్లలో బాలానగర్ - మెదక్ రూట్లో వాహనాల రద్దీ బాగా పెరిగింది. పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట మాత్రమే ఫోర్ లేన్ రోడ్డు ఉండి, మిగితా అంతా టూ లేన్ రోడ్డు ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నేషనల్ హైవే కావడం వల్ల వాహనాలు చాలా స్పీడ్‌గా వెళ్తున్నాయి. ఈ క్రమంలో రెండు వరుసల రోడ్డు ఉన్న చోట తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గుమ్మడిదల, నర్సాపూర్ మధ్యలో, నర్సాపూర్మండలం పెద్ద చింతకుంట, చిన్న చింతకుంట, రెడ్డిపల్లి, కౌడిపల్లి మండలం తునికి, రాయిలాపూర్, నాగ్సానిపల్లి, ధర్మాసాగర్ గేట్, కొల్చారం మండలం లోతువాగు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా కనీసం పది మంది మృత్యువాత పడుతున్నారు.
మెదక్ లో ట్రాఫిక్ ఇబ్బందులు..
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం మీదుగా ఒకే ఒక రోడ్డు ఉంది. హైదరాబాద్, బోధన్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, నర్సాపూర్, చేగుంట, బీదర్ వైపు వెళ్లాలన్నా, ఏ వాహనమైనా పట్టణం మధ్యలో నుంచే వెళ్లాలి. వివిధ డిపోల ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు, బైక్‌లు, వివిధ రాష్ట్రాలకు ముడిసరుకు తీసుకెళ్లే కంటైనర్లు, ఇసుక లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణ పరిధిలో రోడ్డు మీద ఎదైనా ప్రమాదం జరిగినా, ఎవరైనా రాస్తారోకో, ధర్నా చేసినా ట్రాఫిక్ స్తంభించాల్సిందే.
బైపాస్ రోడ్డు లేకపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. నేషనల్ హైవే అథారిటీ సర్వే నిర్వహించి బైపాస్ ఎక్కడ నుంచి నిర్మించేందుకు అవకాశం ఉంది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది గుర్తించనున్నారు. హైవేను మొత్తం ఫోర్ లైన్‌గా విస్తరించేందుకు, మెదక్ బైపాస్ రోడ్డు నిర్మించేందుకు కేంద్రం నుంచి నిధులు మంజురైతే వాహనదారుల ఇబ్బందులు దూరమవుతాయి.