యాసంగి టెండర్ల ప్రక్రియ నుంచి హాకాను తప్పించిన పౌరసరఫరాల సంస్థ

యాసంగి టెండర్ల ప్రక్రియ నుంచి హాకాను తప్పించిన  పౌరసరఫరాల సంస్థ

  హైదరాబాద్, వెలుగు: యాసంగి ధాన్యం టెండర్ల ప్రక్రియ నుంచి హైదరాబాద్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్(హాకా) ను తప్పించారు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో వార్షిక టర్నోవర్ రూ.200 కోట్లు లేదనే కారణంతో హాకా టెండర్లను పరిగణనలోకి తీసు కోవద్దని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. మొత్తం 12 లాట్లలో... 5 లాట్లకు హాకా టెండర్ బిడ్లు దాఖలుచేసింది. ఈ ఐదు బిడ్డింగులు కూడా తిరస్కరణకు గురయ్యాయి. పౌరసరఫరాల సంస్థ మొదట జారీచేసిన మార్గదర్శకాల్లో... అగ్రి కమోడిటీ టర్నోవర్ రూ. 200 కోట్లు ఉండాలని ప్రస్తావించలేదు. 

ఆతర్వాత జనవరి 31 తేదీన ప్రీ బిడ్డింగ్ సమావేశం నిర్వహించిన తర్వాత నిబంధనలు మార్చినపుడు... తప్పనిసరిగా వ్యవసాయ ఉత్పత్తుల టర్నోవర్ రూ.200 కోట్లు ఉండాలని పేర్కొన్నారు. ఆ నిబంధన ప్రకారం చూస్తే... హాకాకు అగ్రి కమోడిటీ టర్నోవర్ రూ. 200 కోట్లు లేదు. దీంతో హాకా దాఖలుచేసిన బిడ్లను తిరస్కరించినట్లు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు.