
- కోటి 20 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి
- 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: దసరా, దీపావళి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను 3% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన డీఏ జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. డీఏ, డీఆర్పై మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు కోటి 20 లక్షల మంది కేంద్ర ఎంప్లాయీస్, రిటైర్ ఉద్యోగులు లబ్ధి పొందుతారని తెలిపారు. తాజా నిర్ణయంతో 55 శాతంగా ఉన్న డీఏ 58 శాతానికి చేరిందని తెలిపారు.
కేంద్ర ఖజానాపై ఏటా రూ.10 వేల కోట్ల భారం
49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులకు ఓవరాల్గా 58% డీఏ అందుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అక్టోబర్ జీతంలో పెరిగిన డీఏ 3శాతంతో పాటు గత 3 నెలల (జులై, ఆగస్టు, సెప్టెంబర్) డీఏ బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.
‘‘మార్చిలో డీఏను 2% పెంచినం. దీంతో బేసిక్ పే చెల్లింపులు 53% నుండి 55 శాతానికి చేరింది. తాజా పెంపుతో డీఏ 58 శాతానికి పెరిగింది. డీఏ, డీఆర్ కారణంగా ఏటా ప్రభుత్వంపై రూ.10,084 కోట్ల భారం పడుతుంది’’ అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాలకు రూ.5,863 కోట్లు
దేశవ్యాప్తంగా రూ.5,863 కోట్లతో 57 నూతన కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘‘మొదటిసారిగా అన్ని 57 కేంద్రీయ విద్యాలయాలను జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా, 3 ఏండ్ల ప్రాథమిక ప్రీ -ప్రైమరీ తరగతులైన బాల్వటికలను కలిగి ఉంటాయి. అదేవిధంగా, బయోమెడికల్ రీసెర్చ్ కెరియర్ ప్రోగ్రామ్ (బీఆర్‌సీపీ) మూడో దశను కొనసాగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని మూడో దశ (2025–26 నుంచి 2030–31 వరకు), అలాగే తరువాతి ఆరు ఏండ్ల వరకు (2031 – 32 నుంచి 2037 –38 వరకు) బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), బ్రిటన్కు చెందిన వెల్‌కం ట్రస్ట్ (డబ్ల్యూటీ)తో పాటు ఎస్‌పీవీ, ఇండియా అలయన్స్‌ల మధ్య భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. రూ.1,500 కోట్ల మొత్తం వ్యయంతో 2030–31 వరకు అనుమతించిన ఫెలోషిప్, గ్రాంట్లను మంజూరు చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం.’’ అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
రైతులకు కనీస మద్దతు ధర భరోసా
పప్పు దినుసులు కోసం ఆత్మనిర్భర్ భారత్ కింద రూ.11,440 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ‘‘6 రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.కుసుమల(క్వింటాలు)కు రూ.600, మైసూరు పప్పుకు రూ.300, ఆవాల(క్వింటాల్)కు రూ.250, క్వింటాల్ శనగపప్పుకు రూ.225, క్వింటాల్ బార్లీకి రూ.170, క్వింటాల్ గోధుమల విషయంలో రూ.160 పెంచుతూ నిర్ణయం తీసుకున్నది’’అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.