పంట గిట్టుబాటు ధరలు పెంచిన కేంద్రం.. వడ్లపై రూ. 143 పెంపు

పంట గిట్టుబాటు ధరలు పెంచిన కేంద్రం.. వడ్లపై రూ. 143 పెంపు

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీప్ సీజన్ లో పండిన పంటలకు మద్దతు ధర(MSP) ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెసర్లపై 10 శాతం కనీస మద్దతు ధర, వరిపై 7 శాతం పెంచింది.  రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యాలుగా మద్దతు ధరను పెంచామని  కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ తెలిపారు. ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (CACP) సిఫారసుల ఆధారంగా వివిధ పంటల కనీస మద్ధతు ధరలను నిర్ణయిస్తామని వివరించారు. 

ఈ ఖరీఫ్ సీజన్ లో వరి కనీస మద్ధతు ధరను క్వింటాల్ కు రూ. 143 పెంచారు. తాజా పెంపుతో క్వింటాల్ వరి  ధర రూ. 2,183 కు చేరుకుంది. గతేడాది ఇది రూ. 2,040 గా ఉంది. అలాగే, ఏ గ్రేడ్ వెరైటీ వరి ఎంఎస్పీని క్వింటాల్ కు రూ. 163 పెంచారు. దాంతో ఏ గ్రేడ్ వరి ధర క్వింటాల్ కు ఎంఎస్పీ ధర రూ. 2,203 కి చేరింది. గతేడాది ఇది రూ. 2060 గా ఉంది. ఇక పెసర్ల పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు. తాజా పెంపుతో పెసర క్వింటాల్ కనీస మద్దతు ధర రూ. 8,558 కి చేరింది. గతేడాది ఖరీఫ్ సీజన్ లో ఇది రూ. 7,755 గా ఉంది. 

అలాగే, హైబ్రిడ్‌ జొన్న క్వింటాల్‌ రూ.3180, జొన్న(మాల్దండి), రూ.3225, రాగి రూ.3846, సజ్జలు రూ.2500, మొక్కజొన్న రూ.2090, పొద్దుతిరుగుడు(విత్తనాలు) రూ.6760, వేరుశెనగ రూ.6377, సోయాబీన్‌ (పసుపు పచ్చ) రూ.4600, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7020చొప్పున ఈ సీజన్‌లో ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2023-24 మార్కెటింగ్ సీజన్‌కు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల పెంపునకు బుధవారం ఆమోదం తెలిపింది. 

ఎంఎస్‌పీ అంటే..

మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా ప్రభుత్వం రైతుల నుండి పంటలను కొనుగోలు చేసే రేటును ఎంఎస్‌పీ అంటారు.  ఖరీఫ్, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది.ఇది రైతులకు హామీగా,  మరింత ఆహారాన్ని పండించడానికి వారికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది.