మహా‘రాష్ట్ర’ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు

 మహా‘రాష్ట్ర’ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు

మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తన అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి కేబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగుర వేశారు. దీంతో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులు, చిన్న చిన్న రాజకీయ పార్టీల నుంచి తమకు( బీజేపీ) పెద్ద ఎత్తున మద్దతు లభించిందని చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండేతో 35 మంది ఎమ్మెల్యేలు వెళ్లి ఉంటారని అన్నారు. 

 

ఇప్పుడు మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, అయితే.. సాంకేతికంగా మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి రాష్ట్ర  ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశాన్ని పిలవాలని డిమాండ్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. జూలై 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, ఆ తర్వాత అవిశ్వాస తీర్మానంపై పరిశీలిస్తామని వ్యాఖ్యనించారు. ప్రస్తుతం తాము రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అయితే.. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏక్ నాథ్ షిండే బీజేపీకి ఎలాంటి ప్రతిపాదన పంపలేదని చెప్పారు. అయితే.. రాష్ర్ట రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చన్నారు. 

మంత్రి ఏక్ నాథ్ షిండేపై శివసేన వేటు 
అనుచర ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగుర వేసిన పార్టీ సీనియర్ నేత, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్ నాథ్ షిండేపై శివసేన పార్టీ చర్యలు తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీ లెజిస్లేటివ్ గ్రూప్ లీడర్ పదవి నుంచి ఏక్ నాథ్ ను తప్పించింది. ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో దెబ్బతిన్న  మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి షిండే తిరుగుబాటు రూపంలో ఇప్పుడు మరో షాక్ తగిలింది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి షిండే వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ  కూటమి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో మహా వికాస్ అఘాడీ  కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. మహారాష్ట్రలో ఇలాంటి క్యాంపు రాజకీయాలు చూడటం ఇది మూడోసారి అని వ్యాఖ్యానించారు. 

శివసేనకు చెందిన కీలక నేత ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు సూరత్ రిసార్ట్ కు షిఫ్ట్ అయ్యారు. దీంతో పరిణామాలన్నీ మారిపోయాయి.  మంత్రి ఏక్ నాథ్ షిండే రెబెల్ గా మారి సూరత్ రిసార్ట్ లో క్యాంప్ పెట్టడంతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. షిండే తో పాటు 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే 2/3 మెజారిటీతో శివసేన చీలిక వర్గానికి అధికారిక గుర్తింపు లభించే ఛాన్స్ ఉంటుంది. దీంతో నేరుగా బీజేపీకి, మద్దతు ఇవ్వడం లేదా విలీనమైన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉండనుంది. మరోవైపు తాజా పరిణామాలతో ఉద్ధవ్ థాక్రే అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు హాజరైనట్లు తెలుస్తోంది.

https://twitter.com/ANI/status/1539183968679251968