మార్చి 14 ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ

మార్చి 14 ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ

హైదరాబాద్, వెలుగు: 317, 46 జీవోల వల్ల ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించేందుకు ఈ నెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహ ప్రకటించారు. ఆయన నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మంగళవారం సెక్రటేరియెట్‌లో జరిగింది. మంత్రులు శ్రీధర్‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆ రెండు జీవోల వల్ల  ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు మంత్రులకు వివరించారు.

ఈ సందర్భంగా సబ్ కమిటీ చైర్మన్, మంత్రి దామోదర మాట్లాడుతూ.. 317 జీవో వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి అభిప్రాయాలను, వినతులను కమిటీ ముందు చెప్పుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా అవకాశం కల్పించాలని, ఇందుకోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు ప్లానింగ్ డిపార్ట్​మెంట్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ గ్రీవెన్స్​ సెల్​కు ప్రభుత్వ సర్వీసుల శాఖ సెక్రటరీ నోడల్ అధికారిగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.