కాళేశ్వరం గుదిబండను ఎట్ల మోస్తరు?..నెలకు రూ. 2,100 కోట్లు ఎట్ల కడ్తరు

కాళేశ్వరం గుదిబండను ఎట్ల మోస్తరు?..నెలకు రూ. 2,100 కోట్లు ఎట్ల కడ్తరు
  • రాష్ట్ర సర్కారును ప్రశ్నించిన కాగ్​
  • పెరిగే ఖర్చును భరించేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళికలేమిటి?
  • రూ. 63,352 కోట్లతో పూర్తయ్యే దాన్ని రీడిజైన్​ పేరిట 1,51,168 కోట్లకు చేర్చారు
  • ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం లిమిట్​కు మించి లోన్లు.. ఇకపై రాకుంటే పరిస్థితేంది?
  • పెండింగ్​ పనులు ఎట్ల పూర్తి చేస్తరు.. ప్రిలిమినరీ రిపోర్టులో ప్రశ్నల వర్షం!
  • సమాధానాలు చెప్పేందుకు మల్లగుల్లాలు పడుతున్న ఆర్థిక శాఖ

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిందని, ఆ భారాన్ని ఎట్ల మోస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్ ​ప్రశ్నించింది. ప్రాజెక్టుకు పెరిగే ఖర్చును భరించేందుకు మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటో చెప్పాలని అడిగింది. ఇటీవల సమర్పించిన ప్రిలిమినరీ రిపోర్టులో కాళేశ్వరంపై అనేక సందేహాలను కాగ్​ లేవనెత్తినట్టు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు, ఇందుకోసం తీసుకున్న లోన్లు, కరెంట్​బిల్లులు, మెయింటెనెన్స్, డిజైన్లపై రిపోర్టులో అనేక ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. 

ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాగ్​ కోరింది. ఎలాంటి సమాధానాలు ఇవ్వాలనే దానిపై మంగళవారం సెక్రటేరియెట్​లో ఫైనాన్స్, ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ప్రిలిమినరీ రిపోర్టులో కాగ్ లేవనెత్తిన అంశాలు, ప్రశ్నలు బయటికి రాకుండా ప్రభుత్వ పెద్దలు జాగ్రత్త పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి పెను భారంగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిందనే అంశాన్ని కాగ్ ​ప్రధానంగా లేవనెత్తినట్టు తెలిసింది. పనుల ఆలస్యంతో పెరగబోయే నిర్మాణ వ్యయాన్ని కూడా ఎట్ల భరించబోతున్నారని కాగ్​ప్రశ్నించినట్లు సమాచారం.

పాత డిజైన్​లో కడ్తే రూ.63,352 కోట్లతోనే అయ్యేది

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి పాత డిజైన్​లో ప్రాజెక్టు కడ్తే రూ.63,352 కోట్లతోనే పూర్తయ్యేదని, రీ డిజైన్​ కారణంగా ఇప్పటివరకు నిర్మాణ వ్యయం రూ.1,02,268 కోట్లకు చేరిందని కాగ్​ తెలిపింది. మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి రూ.1,51,168 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇప్పటికే ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి లోన్లు తీసుకున్నారని, ఇకపై లోన్లు రాకుంటే ప్రాజెక్టుకు పెరగబోయే వ్యయాన్ని భరించడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే సమాచారం కాగ్​అడిగినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ కీలక ప్రశ్నలు లేవనెత్తడం వాటికి ఎలాంటి సమాధానాలు చెప్పాలో తెలియక అధికారులు నానా తంటాలు పడుతున్నారు. కాగ్​ అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెప్పలేకపోతే అది తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు కాగ్ కు సమాధానాలిచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.

ఏటా రూ.25,109 కోట్లు అవసరం

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్ల రీపేమెంట్లకు ఏటా రూ.13 వేల కోట్లకు పైగా అవసరం. రానున్న పదేండ్లు ఇంత భారీ మొత్తం కేటాయించక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టు అడిషనల్​టీఎంసీని కలుపుకుని కరెంట్​బిల్లులకు ఏటా రూ. 11,359 కోట్లు అవసరమవుతాయని కాగ్ లెక్క కట్టింది. ఇవి కాకుండా ప్రాజెక్టు ఆపరేషన్స్​ అండ్​ మెయింటనెన్స్​కు ఏటా ఇంకో రూ.272 కోట్లు కావాలి. ఈ లెక్కన ఏడాదికి కనీసం రూ.25,109  కోట్లు అవసరం.. అంటే నెలకు కనీసం రూ.2,100 కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆయకట్టుకు ఇచ్చే నీళ్లకు రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేస్తామని.. తాగునీరు, ఇండస్ట్రీస్​కు ఇచ్చే నీటి ద్వారా ఆదాయం సమకూరుతుందని ప్రాజెక్టు డీపీఆర్​లో ప్రభుత్వం పేర్కొంది. అట్ల వచ్చే ఆదాయంతోనే లోన్లు రీపేమెంట్​ చేస్తామని ఆయా ఫైనాన్స్​సంస్థలు, బ్యాంకులతో చేసుకున్న అగ్రిమెంట్లలోనూ పొందుపరిచింది. 

ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించి నాలుగేండ్లయినా గరిష్టంగా ఒక్క సీజన్​లో 74 వేల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేదు. ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు ఈ ప్రాజెక్టు కింద పంట కాల్వలే లేవు. భగీరథకు, ఇతర నీటి పథకాలకు ఇచ్చే నీటికి ఇప్పటికైతే పన్నులు వసూలు చేయడం లేదు. ఒకవేళ వసూలు చేసినా ప్రజల నుంచి కాకుండా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధుల నుంచే వాటిని తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. పరిశ్రమల నుంచి ఇప్పటికైతే పెద్దగా ఆదాయం రావడం లేదు. దీంతో కాళేశ్వరం లోన్ల రీపేమెంట్లకు బడ్జెట్​లోనే నిధులు కేటాయించాల్సి వస్తున్నది. కరెంట్​బిల్లులు, ఆపరేషన్​ అండ్​ మెయింటనెన్స్​ కోసం చేసే ఖర్చు దీనికి అదనం. ఈ లెక్కన మొత్తంగా ఒక్కో నెలకు కాళేశ్వరం కోసం రూ. 2,100 కోట్లు కావాలని, దీన్ని ఎట్ల సమకూరుస్తారని కాగ్​నిలదీసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా నెలకు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. ఇందులో ఐదో వంతు కాళేశ్వరం కోసమే ఖర్చు చేస్తే ప్రభుత్వ నిర్వహణ,  ఇతర వ్యవహారాలను ఎట్ల చక్క బెడుతారని కాగ్​ప్రశ్నించింది.

లోన్లను వేరే వాటికి  ఎట్ల మళ్లిస్తరు?

కాళేశ్వరం ప్రాజెక్టును 56 పనులుగా విభజించగా.. అందులో 12 పనులు మాత్రమే పూర్తయ్యాయని, మిగిలిన 40 పనులు మూడు శాతం నుంచి 90 శాతం వరకు వివిధ దశల్లో ఉన్నాయని కాగ్​ వెల్లడించింది. ఇంకో నాలుగు పనులు అసలు ప్రారంభమే కాలేదని తెలిపింది. ప్రాజెక్టు పనుల కోసం 98,110 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 63,972 ఎకరాలు మాత్రమే సేకరించారని, మిగతా భూమి సేకరించలేదని గుర్తుచేసింది. ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం రూ. 4,011 కోట్ల మార్జిన్​మనీ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు ఇవ్వలేదని కాగ్​ లేవెనెత్తింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న లోన్లలో రూ.1,690 కోట్లను ఇతర పనుల కోసం ఎట్ల మళ్లిస్తారని తప్పుబట్టింది. 

చెల్లింపులకే ఏటా 25వేల కోట్లు

  • ప్రాజెక్టు కోసం తీసుకున్న లోన్ల రీపేమెంట్లకే ఏటా రూ.13 వేల కోట్లకుపైగా చెల్లించాలి. దీన్ని పదేండ్ల పాటు భరించాలి. 
  • అడిషనల్ ​టీఎంసీని కలుపుకుని కరెంట్​ బిల్లులకు ఏటా రూ. 11,359 కోట్లు అవసరం.  
  • ప్రాజెక్టు ఆపరేషన్స్ ​అండ్ ​మెయింటనెన్స్​కు ఏటా రూ. 272 కోట్లు కావాలి. 
  • మొత్తంగా ఏడాదికి కనీసం రూ.25,109  కోట్లు.. అంటే నెలకు దాదాపు రూ.2,100 కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుందని కాగ్​ తెలిపింది.