కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు... 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు...  5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

పశ్చిమ బెంగాల్ లో ఓబీసీ సర్టిఫికెట్లపై కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2010 తర్వాత జారీచేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.  తపబ్రత చక్రవర్తి, రాజశేఖర్ మంథాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును  వెల్లడించింది. ఈ తీర్పుతో  5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లపై ప్రభావం చూపనుంది.   అయితే ఈ సర్టిఫికెట్స్ ఆధారంగా  ఇప్పటికే  ఉద్యోగాలు వచ్చిన లేదా.. రిజర్వేషన్ల ద్వారా ఏదైనా లబ్ధిపొందిన వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని కోర్టు స్పష్టం చేసింది. 

2011లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన  తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం  వెనుకబడిన తరగతులు (షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు కాకుండా) (సేవలు,  పోస్ట్‌లలో ఖాళీల రిజర్వేషన్) చట్టం కింద కొన్ని వర్గీకరణలు చేసింది. అయితే ఈ నిబంధనలు చట్ట విరుద్ధంగా ఉన్నాయంటూ  సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ ను ఇవాళ విచారించిన కోర్టు.. పలు క్లాసులను రద్దు చేస్తున్నట్లు  తీర్పు వెలువరించింది.  దీంతో 2010 తర్వాత ఇచ్చిన అన్నిఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు తీర్పునిచ్చింది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ సర్టిఫికెట్లు రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది. 

మరో వైపు హైకోర్టు తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును తాము అంగీకరించబోమని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని చెప్పారు.