షెడ్యూల్ ప్రకారమే బైపోల్.. వాయిదాకు హైకోర్టు నో

షెడ్యూల్ ప్రకారమే బైపోల్.. వాయిదాకు హైకోర్టు నో

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నియోజకవర్గ బై ఎలక్షన్ వాయిదా వేయాలన్న అభ్యర్థనను కోల్‌కతా హైకోర్టు తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రాసెస్ మొదలుపెట్టిందని, ఈసీ నిర్ణయంలో తాము కలుగజేసుకోవాల్సిన అవసరం ఏమీ కనపడడం లేదని కోర్టు తెలిపింది. అయితే ఈ ఉప ఎన్నికలు అత్యవసరంగా నిర్వహించాలంటూ ఈసీకి బెంగాల్ సీఎస్‌ లేఖ రాయడంపై హైకోర్టు తప్పుబట్టింది.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మమతా బెనర్జీ.. తన పార్టీ మెజారిటీ సీట్లు గెలవడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా గెలవకుంటే ముఖ్యమంత్రిగా కొనసాగడం వీలు కాదు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగా.. అక్టోబర్‌‌ చివరిలోపు ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. దీంతో అత్యవసరంగా ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, తక్షణం ఎన్నికలు పెట్టాలని కోరుతూ ఆ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ గత నెలలో ఈసీకి లేఖ రాశారు. అయితే ఆ లేఖ రాయడం ద్వారా సీఎస్‌.. భారత రాజ్యంగ నిబంధనలను ఉల్లంఘించారని, మమత సీఎం పదవిలో లేకపోతే సంక్షోభం వస్తుందని సీఎస్ పేర్కొనడం ఓటర్లను ప్రభావితం చేయడమేనంటూ సాయన్  బెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. సెప్టెంబర్ 30న జరగబోతున్న ఈ ఉప ఎన్నికను వాయిదా వేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. సీఎస్‌ తీరును తప్పుబట్టింది. పబ్లిక్‌ సర్వెంట్‌గా చీఫ్‌ సెక్రెటరీ ఒక వ్యక్తి పవర్‌‌లో ఉండాలని కోరుకోవడం తగదని, చట్ట ప్రకారం విధులు నిర్వహించాలని సూచించింది. ఎవరో ఒక వ్యక్తి లేకపోతే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని సీఎస్ నిర్ణయించడం తప్పని పేర్కొంది. అయితే ఈసీ సెప్టెంబర్‌‌ 4నే ఎన్నికలపై ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే భవానీపూర్‌‌ ఓటింగ్ జరుగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం..

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్

పక్కా ప్లాన్‌తోనే మారణకాండ.. బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు