డాక్టర్ మర్డర్ కేసు సీబీఐకి.. ఆదేశాలు జారీ చేసిన కోల్‌కతా హైకోర్టు

డాక్టర్ మర్డర్ కేసు సీబీఐకి.. ఆదేశాలు జారీ చేసిన కోల్‌కతా హైకోర్టు

కోల్ కతా: ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ట్రెయినీ డాక్టర్ పై రేప్, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రంలోగా కేసు డైరీని సీబీఐకి అప్పగించాలని, బుధవారం ఉదయం 10 గంటలకల్లా మిగతా అన్ని డాక్యుమెంట్లను హ్యాండోవర్ చేయాలని కోల్ కతా పోలీసులను ఆదేశించింది. 

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రెయినింగ్ లో ఉన్న ఓ మహిళా పీజీ డాక్టర్(31)ను శుక్రవారం ఓ వ్యక్తి అతి దారుణంగా రేప్, హత్య చేయడంపై దేశవ్యాప్తంగా మెడికోలు, డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, తమకు భద్రత కల్పించాలన్న డిమాండ్లతో విధులను బహిష్కరిస్తున్నారు. దీంతోపాటు కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఐదు రోజులు కావస్తున్నా కేసు దర్యాప్తులో పోలీసులు ఎలాంటి పురోగతిని చూపడంలేదంటూ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఒక మెడికల్ కాలేజీలో అతిదారుణమైన హత్య జరిగితే.. వెంటనే ఎవరూ ఫిర్యాదు చేయలేదన్న కారణంతో మర్డర్ కేసుగా కాకుండా అసహజ మరణంగా కేసు నమోదు చేయడం ఏమిటంటూ బెంగాల్ ప్రభుత్వంపై చీఫ్ జస్టిస్ టీఎస్ శివగ్నానమ్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ను లాంగ్ లీవ్ పై వెళ్లాలని హైకోర్టు ఆదేశించగా.. ఆయన సోమవారం రాజీనామా చేశారు. కానీ ఆ వెంటనే అతడిని మరో మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా నియమించడంపై కూడా హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆస్పత్రుల్లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. అందుకే డాక్టర్లంతా తిరిగి విధుల్లో చేరాలని కోరింది. కాగా, మంగళవారం కూడా పశ్చిమ బెంగాల్ అంతటా జూనియర్ డాక్టర్లు, ఇతర స్టాఫ్ విధులను బహిష్కరించారు.

మా బిడ్డది ఆత్మహత్య అని ఎందుకు చెప్పినట్లు..?

దవాఖాన సెమినార్ హాల్​లోనే తమ కూతురు దారుణంగా రేప్, హత్యకు గురైనా.. ఆస్పత్రి చెస్ట్ మెడిసిన్ విభాగం అధిపతి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ తమకు ఫోన్ చేసి మా బిడ్డ ఆత్మహత్య చేసుకుందన్నాడని బాధితురాలి తల్లిదండ్రులు మీడియాకు వెల్లడించారు. 

కాలేజీకి వెళ్లిన తర్వాత చాలా సేపటి వరకు తమ బిడ్డను చూడనివ్వలేదన్నారు. తమ బిడ్డ హత్య వెనక దవాఖాన సిబ్బంది పాత్ర కూడా ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కూడా విచారణ చేయాలని కోరుతున్నారు. దీంతో ఆత్మహత్య అని ఎందుకు చెప్పారో వివరణ ఇవ్వాలంటూ అసిస్టెంట్ సూపరింటెండెంట్​కు పోలీసులు సమన్లు జారీ చేశారు.