హుజూరాబాద్​ బై పోల్​ జోరు షురూ

హుజూరాబాద్​ బై పోల్​  జోరు షురూ
  • ఖరారైన ప్రధాన పార్టీల అభ్యర్థులు
  • బరిలో ఈటల రాజేందర్​, గెల్లు శ్రీనివాస్​, బల్మూరి వెంకట్​
  • ప్రతి ఓటరును కలిసేందుకు పార్టీల ప్రయత్నాలు 
  • ప్రచారాన్ని స్టార్ట్​ చేసిన బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​
  • ఇప్పటికే  ఓ దఫా మెజారిటీ ఊర్లను చుట్టివచ్చిన ఈటల 
  •  సింగాపూర్​ క్యాంపు కేంద్రంగా హరీశ్​ వ్యూహాలు
  • రెండు రోజుల్లో క్యాంపెయిన్​లోకి  కాంగ్రెస్

కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్​ ఉప ఎన్నిక జోరు మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో ప్రచారం ఊపందుకుంది. బీజేపీ క్యాండిడేట్​గా మాజీ మంత్రి ఈటల రాజేందర్​, టీఆర్​ఎస్​ క్యాండిడేట్​గా గెల్లు శ్రీనివాస్​, కాంగ్రెస్​ క్యాండిడేట్​గా  బల్మూరి వెంకట్​ పోటీలో ఉన్నారు. ఈ నెల 1న బైపోల్​ నోటిఫికేషన్ విడుదల కాగా, 30న పోలింగ్​ జరగనుంది. ఇప్పటికే బీజేపీ, టీఆర్a​ఎస్​ బై ఎలక్షన్ ​​టీంలను ప్రకటించాయి. బీజేపీ తరఫున ఆ పార్టీ చీఫ్ బండి సంజయ్ ఆదివారం హుజూరాబాద్ లో ఈటల రాజేందర్​తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్​ఎస్​ తరఫున హుజూరాబాద్​ ఎన్నికల ఇన్​చార్జ్​గా ఉన్న మంత్రి హరీశ్​రావు సింగాపూర్​ క్యాంప్​ ఆఫీస్​ కేంద్రంగా ప్రచార వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఆదివారం కమలాపూర్​ మండల కేంద్రంలో నిర్వహించిన ధూం ధాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు, మూడురోజుల్లో తమ ప్రచారం స్పీడప్​ చేస్తామని కాంగ్రెస్​నేతలు చెప్తున్నారు. 


బీజేపీ స్టేట్​చీఫ్​ బండి సంజయ్‍ చేపట్టిన పాదయాత్ర శనివారం ముగియడంతో ఆయన హుజూరాబాద్‍ బై ఎలక్షన్​పై ఫోకస్‍ పెట్టారు. ప్రచారానికి ఆదివారం శంఖం పూరించారు. కరెన్సీ నోటుకు.. కమలం గుర్తుకు మధ్య జరిగే పోటీలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే నైతిక బాధ్యతగా సీఎం రాజీనామా చేయాలని  ఆయన సవాల్​ విసిరారు. కాగా, మంత్రి పదవికి, టీఆర్​ఎస్ ​పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఇప్పటికే ఈటల రాజేందర్ ​నియోజకవర్గంలోని అన్ని మండలాలను దాదాపుగా చుట్టి వచ్చారు. ఆయన భార్య జమున కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కొద్దిరోజుల కిందే  మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల టీంను వేసింది. ఈ టీం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ప్రచారానికి దిగకున్నా మాజీ ఎంపీలు వివేక్​ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్​రెడ్డి, బొడిగె శోభలాంటి కొందరు నేతలు ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.  ఒకటిరెండు రోజుల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో టీం రంగంలోకి దిగుతుందని బీజేపీ లీడర్లు చెప్తున్నారు. సందర్భాన్ని బట్టి  కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి లీడర్లు కూడా ప్రచారంలో పాల్గొంటారని, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సభ కూడా ఉంటుందని అంటున్నారు. 
హరీశ్​రావు మకాం
టీఆర్ఎస్​ ఎన్నికల ఇన్​చార్జ్​గా ఉన్న మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్​లోనే తిష్ట వేశారు. హుజూరాబాద్​పక్కనే ఉన్న సింగాపూర్ క్యాంపు ఆఫీస్ కేంద్రంగా ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ముఖ్య నాయకులతో మీటింగ్ లు పెడుతూనే  అభ్యర్థితో అన్ని మండలాల్లో తిరుగుతున్నారు. రెండు రోజుల నుంచి ధూం ధాం కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఆదివారం  హుజూరాబాద్ లో ఒక ప్రెస్ మీట్​కు హాజరైన ఆయన సాయంత్రం కమలాపూర్ లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటలను ఆయన టార్గెట్​ చేస్తున్నారు. బండి సంజయ్ లాంటి లీడర్లు చేసిన కామెంట్లకు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు.  మంత్రి గంగుల కమలాకర్‍  హుజూరాబాద్‍లో రోజూ మార్నింగ్​ వాక్‍ చేపడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. షెడ్యూల్​కు ముందు పది, పదిహేను రోజులపాటు కుల సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర వర్గాలతో సమావేశాలు నిర్వహించిన టీఆర్‍ఎస్‍ నాయకులు.. కోడ్​ ఎఫెక్ట్​తో  ప్రస్తుతం రూట్‍ మార్చారు. మంత్రులు హరీశ్, గంగుల, కొప్పుల ఈశ్వర్​తోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్‍ .. స్థానికంగా ఉన్న లీడర్లు, ముఖ్య కార్యకర్తలతో రోజూ భేటీ అవుతున్నారు. ఊర్లలో తాజా పరిస్థితులపై ఆరా తీస్తూ ప్రజల మూడ్​ను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కుల, మహిళా సంఘాల ఓట్లను గంపగుత్తగా రాబట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు ఆ పార్టీ లీడర్లే చెప్తున్నారు. ప్రచారం ముగిసే ఒకటీ రెండు రోజుల ముందు సీఎం కేసీఆర్​ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని వారు అంటున్నారు.  
రెడీ అవుతున్న కాంగ్రెస్​
రెండు రోజుల కింద  బల్మూరి వెంకట్‍ను తమ అభ్యర్థిగా కాంగ్రెస్​ ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్​ నెలకొన్నది. 2018 అసెంబ్లీ, లోక్‌‌సభ ఎన్నికల్లో హుజూరాబాద్​ నుంచి కాంగ్రెస్​ 50 వేలకు పైగా ఓట్లు సాధించింది.  బలమైన ఓటు బ్యాంక్‍ ఉన్నప్పటికీ ఈటలకు ధీటైన కేండిడేట్​ లేకపోవడం ఆ పార్టీకి కలిసిరాలేదు. పీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి నియామకంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపన కనిపిస్తోంది. సీనియర్లు కూడా ప్రచారానికి రానుండడం ఆ పార్టీకి కొంత ప్లస్​ అని చెప్పవచ్చు. నియోజకవర్గంపై కొంత పట్టు ఉన్న ఎమ్మెల్సీ జీవన్‍రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‍బాబు, పీసీపీ మాజీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పొన్నం ప్రభాకర్‍,  మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‍ ఆధ్వర్యంలో క్యాంపెయిన్​ చేస్తామని కాంగ్రెస్​ లీడర్లు చెప్తున్నారు. అభ్యర్థి వెంకట్‍ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్లు ప్రచారానికి వస్తారని అంటున్నారు. వీలునుబట్టి పీసీసీ ప్రెసిడెంట్‍ రేవంత్‍రెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తారని పేర్కొంటున్నారు. 
ప్రతి గడపకూ వెళ్లాలె.. ప్రతి ఓటరునూ కలవాలె.. 
హుజూరాబాద్​ నియోజకవర్గంలో 5 మండలాల పరిధిలో 107 గ్రామాలున్నాయి.  305 పోలింగ్​ స్టేషన్ల పరిధిలో 2,36,430 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్​.. పాదయాత్ర, ఆత్మగౌరవ యాత్ర పేరిట మెజారిటీ ఊర్లను చుట్టివచ్చారు. కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాల ఆత్మీయ సమ్మేళనాల పేరిట టీఆర్ఎస్​ కూడా జనాన్ని కలిసి వచ్చింది. మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్​ ఇప్పటివరకు ప్రచారం ప్రారంభించలేదు. పోలింగ్​కు మరో 26 రోజులు ఉండడంతో అన్ని పార్టీలు కూడా  ‘ప్రతి గడపకూ వెళ్లాలి.. ప్రతి ఓటరునూ కలవాలి..’ అనే లక్ష్యంతో ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాయి. పెద్ద లీడర్లు, క్యాండిడేట్లు మీటింగులకు పరిమితమైతే సెకండ్​ క్యాడర్​లీడర్లు, ముఖ్యకార్యకర్తలకు గ్రామాల్లో ఇంటింటి ప్రచార బాధ్యతలను అప్పగించనున్నాయి. 


అడుగడుగునా నిఘా 
హుజూరాబాద్  ఉప ఎన్నికలో లిక్కర్​, డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుందనే అంచనా లున్నాయి. ఎన్నికల కమిషన్​కు కూడా ఫిర్యాదులు అందడంతో పోలీసులు నిఘా పెట్టారు.  నియోజకవర్గానికి వచ్చే ప్రధాన రోడ్ల వెంట చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. మద్యం, డబ్బు రవాణాను అడ్డుకోవాలని ఆఫీసర్లు, పోలీసులు పనిచేస్తున్నారు. 15 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 15 స్టాటిక్​ సర్వైలెన్స్​టీంలు ఏర్పాటు చేసి వెహికల్​ చెకింగ్​ ముమ్మరం చేశారు. ఇప్పటికే లిక్కర్​ అక్రమ రవాణాకు  సంబంధించి 18 కేసులు ఫైల్​ చేశారు. ప్రచారానికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకే టైం ఇచ్చారు.  రోడ్ షోలు, బైక్​ ర్యాలీలకు పర్మిషన్​ ఇవ్వడం లేదు.  పబ్లిక్ మీటింగ్ లో జనం 500 నుంచి 1,000 మందికి మించవద్దని ఆదేశించినా చాలాచోట్ల ఈ లిమిట్​ దాటుతోంది. దీనిపై లీడర్లకు ఒకటికి రెండుసార్లు అవగాహన కల్పిస్తున్నామని, ఇక మీదట సహించే పరిస్థితి లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

బీజేపీ బై ఎలక్షన్​ టీం​ 

నియోజకవర్గ ఇన్​చార్జ్: జితేందర్​రెడ్డి​
జమ్మికుంట మండల ఇన్​చార్జులు: ధర్మపురి అర్వింద్, రమేశ్ రాథోడ్,  మార్తినేని 
ధర్మారావు​
హుజూరాబాద్ మండల ఇన్​చార్జ్: రఘునందన్ రావు​
వీణవంక మండల ఇన్​చార్జులు: సోయం బాపురావు, ఏనుగు రవీందర్ రెడ్డి 
హుజూరాబాద్  టౌన్  ఇన్​చార్జ్​: బండ కార్తీక రెడ్డి
హుజూరాబాద్ రూరల్  ఇన్​చార్జ్: రేవూరి ప్రకాశ్ రెడ్డి ​
ఇల్లందకుంట మండల ఇన్​చార్జ్​: చాడ సురేశ్​రెడ్డి
కమలాపూర్​ మండల ఇన్​చార్జ్​: కూన శ్రీశైలం గౌడ్

టీఆర్ఎస్  బై ఎలక్షన్​ టీం 

నియోజకవర్గ ఇన్​చార్జ్:  హరీశ్ రావు 
హుజురాబాద్ మండల ఇన్​చార్జులు: గంగుల కమలాకర్, సతీశ్​ కుమార్ 
హుజూరాబాద్​ టౌన్​ ఇన్​చార్జులు:  సునీల్ రావు
జమ్మికుంట మండల ఇన్​చార్జులు: కొప్పుల ఈశ్వర్, ఆరూరి రమేశ్ 
ఇల్లందకుంట మండల ఇన్​చార్జులు: పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుంకె రవిశంకర్
వీణవంక మండల ఇన్​చార్జులు: నారదాసు లక్ష్మణరావు, జీవీ రామకృష్ణ
కమలాపూర్ మండల ఇన్​చార్జులు: ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డి