- అన్నిపార్టీల లీడర్లను కలుస్తున్న క్యాండిడేట్లు
- మెజార్టీ జీపీలను ఏకగ్రీవంచేసేందుకు ముమ్మర ప్రయత్నాలు
- రెండో దఫా ఎన్నికలు జరిగే జీపీల్లో క్యాండిడేట్ల ఎంపికపై పార్టీల కసరత్తు
మహబూబ్నగర్, వెలుగు: పల్లెల్లో రాజకీయ వాతావరణం మొదలైంది. సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడం ఆసక్తికరంగా మారుతోంది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం ముగియగా.. మెజార్టీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని లీడర్లు సూచిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లడం వల్ల ఖర్చుతో పాటు సమయం వృథా అవుతుందని చెబుతున్నారు.
ఎన్నికలకు పెట్టే ఖర్చును గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేటాయిస్తే ఊరు బాగు పడుతుందని, అందుకే ఏకగ్రీవాలు చేసుకోవాలని చెబుతున్నట్లు తెలిసింది. అయితే రెండో దఫా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. పార్టీలో ఏండ్లుగా ఉంటున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇస్తున్నారని.. ప్రధాన పార్టీల మద్దతు కోరుతున్న క్యాండిడేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసి బలం నిరూపించుకుంటామని లీడర్ల ముందే సవాల్చేస్తున్నారు.
ప్రచారంలోకి క్యాండిడేట్లు..
మొదటి విడత గ్రామ పంచాయతీల్లో క్యాండిడేట్లు ప్రచారాన్ని ప్రారంభించారు. వారికి ఎన్నికల సంఘం నుంచి ఇంకా గుర్తులు కేటాయించకపోయినా.. ప్రజల్లో తాము పోటీలో ఉన్నామనే సంకేతాలు తీసుకెళ్లాలనే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఆయా గ్రామ పంచాయతీల్లో తమకు మద్దతు తెలుపాలని ఓటర్లను కలుస్తున్నారు. పనిలో పనిగా.. అధికార పార్టీ మద్దతుతో పోటీకి దిగిన క్యాండిడేట్లు ప్రతిపక్ష పార్టీల లీడర్లను కలిసి.. పార్టీలకతీతంగా తమకు సపోర్ట్ చేయాలని కోరుతున్నారు.
అయితే కొన్ని గ్రామ పంచాయతీల్లో రెబల్స్‌గా నామినేషన్లు వేసిన లీడర్లు కూడా ప్రచారాన్ని ప్రారంభించారు. తమ వద్దకు లీడర్లు చర్చలకు వస్తే తమ డిమాండ్ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. అయితే సర్పంచ్ స్థానాలను ఎక్కువగా ఏకగ్రీవం చేసేందుకు లీడర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతరులు వేసిన నామినేషన్లను విత్ డ్రా చేయించడానికి చర్చలు జరుపుతున్నారు. ఉప సర్పంచ్ పదవులు ఇస్తామని ఆశ చూపుతున్నారు. అలాగే గ్రామాభివృద్ధికి సర్పంచ్‌గా ఎన్నికయ్యే క్యాండిడేట్ నుంచి డబ్బులు కూడా ఇప్పించేందుకు గ్రామ పెద్దలతో మంతనాలు జరుగుతున్నాయి.
మమ్మల్ని కాదని వాళ్లకు ఎట్లిస్తరు?
రెండో విడత గ్రామ పంచాయతీలకు ఆదివారం నుంచి నామినేషన్లు ప్రారంభం కాగా.. కాంగ్రెస్‌లో లీడర్లు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ముగియగా.. చివరి వరకు పార్టీ మద్దతు కోరి భంగపడిన అశావహులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. అయితే రెండో విడతలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా లీడర్లు పంచాయతీల వారీగా లీడర్లను పిలిచించి మాట్లాడుతున్నారు. ఈక్రమంలో ఏండ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నామని.. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ కోసం పని చేశామనే వాదనలు వినిపిస్తున్నారు. తమకు లేదంటే తమ మద్దతుదారులకు సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మహబూబ్నగర్ , నారాయణపేట జిల్లాలో మొదటి విడత నామినేషన్ వివరాలు
మండలం జీపీలు నామినేషన్లు వార్డులు నామినేషన్లు
గండీడ్ 27 175 228 462
మహమ్మదాబాద్ 22 142 186 385
నవాబుపేట 42 292 354 865
రాజాపూర్ 24 133 198 516
మహబూబ్నగర్ 24 184 222 618
గుండుమాల్ 13 79 114 239
కోస్గి 14 77 122 277
కొత్తపల్లి 16 89 130 277
మద్దూరు 24 127 206 411
