V6 News

వనపర్తి జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర

వనపర్తి జిల్లాలో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర
  • చివరిరోజు ధూం..ధాంగా దావత్ లు
  • వలస ఓటర్లను రప్పించేందుకు కిరాయి చెల్లింపులు
  • రేపు ఎన్నికల పోలింగ్​

వనపర్తి, వెలుగు : మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి రోజు మంగళవారం సర్పంచ్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యనాయకులు ప్రచారం నిర్వహించారు. గురువారం మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ సన్నిహితులు, బంధువుల ఇండ్లలో మందు, విందు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్​ అభ్యర్థులు పోటాపోటీగా దావత్​లు ఇస్తున్నారు. 

మొదటి విడుత ఎన్నికలు..

వనపర్తి జిల్లాలో మొత్తం 268 గ్రామ పంచాయతీలు, 2436 వార్డు స్థానాలున్నాయి. మొదటి విడతలో 87 సర్పంచ్ స్థానాలు, 780 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ముగిసేనాటికి ఒకే ఒక నామినేషన్​పడ్డ అయిదు గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మహబూబ్​నగర్ జిల్లాలోని గండీడ్, మహమ్మదాబాద్, మహబూబ్​నగర్ రూరల్, రాజాపూర్, నవాబుపేట మండలాల్లోని 139 గ్రామ పంచాయతీలు, 1,188 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 

129 గ్రామ పంచాయతీలు, 923 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నారాయణపేట జిల్లాలోని గుండుమాల్, కోస్గి, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లోని 67 గ్రామ పంచాయతీలు, 572 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా, 53 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.  గద్వాల్​జిల్లాలో106 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా,15 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

 91 గ్రామ పంచాయతీలు, 974 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నాగర్​ కర్నూల్​జిల్లాలోని 46 0 గ్రామ పంచాయితీలు ఉండగా, మొదటి విడతలో151 గ్రామ పంచాయతీలు.1326 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 137 సర్పంచ్ స్థానాలు,1118 వార్డులకు ఎలక్షన్స్ జరగనున్నాయి.     

రూ.వెయ్యి కిరాయి..

పల్లె పోరులో నిలబడ్డ అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనరల్​ఎలెక్షన్స్​కు దీటుగా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల నుంచి చాలా మంది ఉపాధి కోసం హైదరాబాద్​లాంటి దూరప్రాంతాలకు వలసపోయారు. 

వారు పోలింగ్ రోజు వచ్చి ఓటేసేందుకు ఒక్కొక్కరికీ రూ.వెయ్యి నుంచి రూ1500 వరకు రానుపోను బస్సు ఛార్జీలతోపాటు భోజనం, చేతి ఖర్చులకు డబ్బులు పంపుతున్నారు. ప్రస్తుతం రబీ సీజన్ నడుస్తున్నందున ప్రచారానికి జనాన్ని కూడగట్టేందుకు రోజు కూలీ ఎక్కువగానే ఇస్తున్నారు. ఒక్కొక్కరికీ రూ.500 వరకు కూలీ ఇస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.