ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

గద్వాల, వెలుగు: రియల్టర్లు ప్రభుత్వ స్థలాలు, గుట్టలనే కాదు.. సాగునీటి కాల్వలను కూడా వదలడం లేదు.   గద్వాల మండలం వెంకంపేట  శివారులోని 118, 119 సర్వే నంబర్లలో  11.09 ఎకరాల భూమి ఉంది.  ఇందులో బఫర్ జోన్ కింద సర్వే నంబర్ 118లో 6 గుంటలు,  119లో 3 గుంటలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పిల్ల కాల్వ కింద సర్వే నెంబర్ 118లో 18 గుంటలు,  119 లో 7 గుంటలు వదిలారు.  ఈ మేరకు 28 గుంటలకు సంబంధించి మున్సిపల్‌‌, రెవెన్యూలో రికార్డులు కూడా ఉన్నాయి. కానీ, గద్వాల న్యూ గంజ్ వ్యవసాయ మార్కెట్ అసోసియేషన్ వారు పిల్ల కాలువను పూడ్చి, బఫర్ జోన్‌‌ను ఆక్రమించుకొని 11.09 ఎకరాల్లో వెంచర్ వేశారు.  దీనికి డీటీసీపీ అప్రూవల్ (ఐపీ నెంబర్ 5740/2019/111/2020/ హెచ్) నంబర్ కూడా తీసుకున్నారు.  ఈ ప్లాట్లను అమ్మి రూ.2 కోట్ల వరకు  సొమ్ము చేసుకున్నారు. 

ఇతర పొలాల్లోకి నీళ్లు

వెంకంపేట శివారులోని సర్వే నెంబర్ 118, 119లో పిల్ల కాలువ, బఫర్‌‌‌‌ జోన్‌‌ను ఆక్రమించుకోవడంతో పైనుంచి వస్తున్న నీళ్లు  658, 659  సర్వే నెంబర్లలోని దళితుల పొలాల్లోకి వెళ్తున్నాయి.  దీంతో వాళ్లు నీళ్లు తమ పొలాల్లోకి వస్తున్నాయని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కాల్వకు సంబంధించిన రికార్డులు సబ్మిట్ చేసినా చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.  

మా దృష్టికి రాలేదు

పిల్ల కాలువ, బఫర్ జోన్‌‌ను ఆక్రమించి వెంచర్ వేసిన విషయం మా దృష్టికి రాలేదు. డీఈని పంపించి రిపోర్ట్ తెప్పించుకుంటం.  అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటం.  రైతులు కూడా ఈ విషయంపై కంప్లైంట్ చేయాలి.

– జుబేర్ అహ్మద్,  
పీజేపీ ఈఈ గద్వాల 

స్కూళ్లకు ఫండ్‌‌ ఇవ్వాలి

మరికల్​, వెలుగు : స్కూళ్లకు నిధులు రాకపోవడంతో హెచ్‌‌ఎంలు ఇబ్బందులు పడుతున్నారని పీఆర్టీయూ టీఎస్​ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి వై.జనార్దన్​రెడ్డి వాపోయారు. బుధవారం మండలంలోని పెద్దచింతకుంట, రాకొండ, పూసల్​పాహడ్, మరికల్​ స్కూళ్లలో సంఘం సభ్యత్వ నమోదు చేయించారు. అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల ఫారాలను టీచర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.  స్కూళ్లకు నిధులు ఇవ్వడంతో పాటు స్కావెంజర్లను నియమించాలన్నారు. సంఘం నేతలు సదన్​రావు, చంద్రశేఖర్​, రంగన్న, అరుణ్​జాన్సన్​, మధు, జూని, నర్సిములు, జీహెచ్‌‌ఎం మనోరంజని, హెచ్‌‌ఎం దత్తాత్రి పాల్గొన్నారు.

మద్యంతోనే మహిళలపై దాడులు

అమ్రాబాద్, వెలుగు:  రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాల కారణంగానే మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని పౌరహక్కుల రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు.  పదర మండలం పెట్రాల్ చేను ఘటనలోని   బాధితురాలిని బుధవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆదాయం కోసం గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం అమ్ముతుండడంతో పిల్లల నుంచి వృద్ధుల వరకు బానిసలవుతున్నారని వాపోయారు.  మద్యం మత్తులో విచక్షణ కోల్పోవడంతోనే నిందితుడు స్నేహితుడితో కలిసి తన అక్కపై అత్యాచారం చేశాడన్నారు.  ఈ ఘటనను మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలయ్య,లక్ష్మినారాయణ, సత్య నారాయణ, వెంకటేశ్ పాల్గొన్నారు. 

దెబ్బతిన్న చెరువులు, కాల్వలకు రిపేర్లు చేయాలి

వనపర్తి, వెలుగు:  జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, కాల్వల మరమ్మతులు చేపట్టాలని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెద్దమందడి మండలంలో  బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలను గుర్తించి.. నివేదిక ఇవ్వాలన్నారు.  ఎంజే 4 , ఖాన్ చెరువు, బుద్దారం రిజర్వాయర్, ఘణపురం రిజర్వాయర్ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని  ఆదేశించారు. అనంతపురం గ్రామానికి సాగునీళ్లు ఇచ్చేందుకు ఏదుల వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి నిర్మించనున్న కొత్త కాలువ భూసేకరణ, నష్ట పరిహారానికి అంచనాలు రెడీ చేసి  పంపించాలన్నారు. సింహాద్రి చెరువు అలుగు కాల్వ, బండరావిపాకుల ఆర్‌‌‌‌అండ్‌‌ఆర్‌‌‌‌ సెంటర్ ద్వారా వెళ్తుండడంతో సెంటర్‌‌‌‌లోని నీళ్లు రాకుండా కొత్త అలుగు నిర్మాణం చేయాలన్నారు.  దీంతో పాటు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్మించాల్సిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయ నిర్మాణానికి ప్లాన్‌‌ రెడీ చేయాలన్నారు.  చెరువులు, కాల్వల నిర్వహణను ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దని  ఇరిగేషన్ అధికారులకు సూచించారు.  ఇరిగేషన్ ఎస్ఈ సత్యశీలారెడ్డి, ఈఈ మధుసూధన్ రావు, డీఈలు వెంకటరమణమ్మ, మోహన్, ఏఈ భరత్ పాల్గొన్నారు.

రోడ్డు పక్కన పూల మొక్కలు నాటండి

కలెక్టర్ ​శ్రీహర్షనారాయణపేట, వెలుగు:  జిల్లాలోని ఆర్‌‌‌‌అండ్‌‌బీ రహదారులకు ఇరువైపులా టెకోమా, ఇతర పూల మొక్కలను నాటాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్‌‌ హాల్‌‌లో హరితహారంపై సమీక్ష నిర్వహించారు.  నారాయణపేట నుంచి జిల్లా బార్డర్ వరకు ఉన్న 19 గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా మూడు ఫీట్ల మొక్కలను నాటాలని చెప్పారు. ఒక్కో మొక్క మధ్య దూరం   1.5 మీటర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీ సెక్రటరీలు అటవీ శాఖ అధికారుల సాయంతో 25లోగా పని పూర్తి చేయాలన్నారు.  ఫారెస్ట్‌‌, జీపీ నర్సరీల్లో నుంచి మొక్కలు తీసుకోవాలని.. ప్రతి మొక్కకు లెక్క ఉండాలని చెప్పారు.   ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, డీఆర్డీవో గోపాల్ నాయక్, డీఎఫ్‌‌వో వీణ వాణి, డీపీవో మురళి, మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ ఇంజనీర్ మహేశ్, ఎంపీడీవో, ఎంపీవో,  పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

రాహుల్ యాత్ర ఓట్ల కోసం కాదు

మహబూబ్​నగర్​ కలెక్టరేట్​/జడ్చర్ల టౌన్​, వెలుగు: ఏఐసీసీ నేత రాహుల్​ గాంధీ నిర్వహిస్తున్న  ‘భారత్​ జోడో’ యాత్ర ఓట్ల కోసం కాదని,  ప్రజల సమస్యలు తెలుసుకునేందుకేనని రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇన్‌‌చార్జి మాణిక్కం ఠాగూర్​ చెప్పారు.  ఈ యాత్ర 23న ఉమ్మడి పాలమూరుకు రానుండడంతో  బుధవారం జడ్చర్ల, మహబూబ్​నగర్​ ప్రాంతాల్లో  రూట్​మ్యాప్‌‌ను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని డీసీసీ ఉపాధ్యక్షుడు సంజీవ్​ ముదిరాజ్ ఇంట్లో  ప్రెస్‌‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ 3,520 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారని, ఇప్పటికే 920 కిలోమీటర్లు  పూర్తయ్యాయని చెప్పారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.  జోడో యాత్ర 23న రాష్ట్రంలోకి  ప్రవేశించనుందని, దీపావళి పండుగ సందర్భంగా 24, 25వ తేదీల్లో విరామం ఉంటుందన్నారు. 26 నుంచి మక్తల్ వేదికగా పాదయాత్ర మళ్లీ ప్రారంభం అవుతుందని వివరించారు. నారాయణపేట జిల్లా మరికల్, పాలమూరు జిల్లా దేవరకద్ర, మన్యంకొండ వద్ద సభలు ఉంటాయన్నారు.  తెలంగాణలోని ప్రజలు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.  ఈ సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, డీసీసీ అధ్యక్షుడు ఒబెదుల్ల కొత్వాల్ పాల్గొన్నారు.

పొలం దున్ననివ్వని ఫారెస్ట్ అధికారులు

వాగ్వాదానికి దిగిన బాధిత రైతులు

లింగాల, వెలుగు: సరిహద్దుల విషయంలో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  బుధవారం లింగాల మండలం చెన్నంపల్లి గ్రామ శివారులో పొలం దున్నుతున్న రైతులను అటవీ  అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులు వారితో వాగ్వాదానికి దిగారు.  ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ .. సర్వేనెంబర్ 436లోని భూమిని 35 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం గ్రామానికి చెందిన 32 మంది రైతులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేసిందన్నారు.  అప్పటినుంచి దాన్నే సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు.  ఇన్నాళ్లు లేనిది అధికారులు ఇప్పుడు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు.  ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ సర్వే నెంబర్‌‌‌‌ 436లో ఉన్నది రెవెన్యూ ల్యాండ్ కాదని,  479 కంపార్ట్మెంట్‌‌కు చెందిన ఫారెస్ట్‌‌ ల్యాండ్ అని స్పష్టం చేశారు.  ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో జాయింట్‌‌ సర్వే చేయించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.  అప్పటివరకు ఎలాంటి వ్యవసాయ పనులు చేయవద్దని ఆదేశించారు.  ఎస్సై రవి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  సమస్య పరిష్కరానికి  కలెక్టర్‌‌‌‌ను కలుస్తామని సర్పంచ్ రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ నరసింహ  తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎఫ్‌‌డీవో నవీన్ రెడ్డి, డీఆర్‌‌‌‌వో ఆనందం, ఎఫ్ఆర్వో ఫర్వేజ్ మహమ్మద్, అచ్చంపేట ఎఫ్ఆర్వో రాజేందర్, సెక్షన్ ఆఫీసర్ సీత, బీట్ ఆఫీసర్లు ఖాదర్ పాషా, రమేశ్‌‌ పాల్గొన్నారు.