
ప్రభుత్వరంగానికి చెందిన కెనరా బ్యాంకు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్విప్) విధానం ద్వారా రూ.ఆరు వేల కోట్లు సమీకరిస్తోంది. ఇందుకోసం ఐదుగురు మర్చంట్ బ్యాంకర్లను నియమించడానికి బిడ్స్ ఆహ్వానించింది. మేనేజ్‌మెంట్, వాటాదారుల నిర్ణయాన్ని బట్టి ఇష్యూ తుది పరిమాణం మారవచ్చని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) తెలిపింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కెనరా బ్యాంక్ ఈక్విటీ క్యాపిటల్ విలువ రూ.753 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వానికి 70.62 శాతం, సాధారణ వాటాదారులకు మిగతా వాటాలు ఉన్నాయి. మూలధన అవసరాలు, విస్తరణ కోసం మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా క్యాపిటల్ మార్కెట్ నుంచి నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.ఐదు వేల కోట్లు, ఇండియన్ బ్యాంకు రూ.ఏడు వేల కోట్లు సేకరించనున్నాయి. మొండిబకాయిలతో, నష్టాలతో సతమతమవుతున్న ప్రభుత్వ బ్యాంకులకు రూ.40 వేల కోట్ల వరకు మూలధనం అవసరమని అంచనా. ప్రభుత్వం అందజేసే మూలధనం సరిపోదు కాబట్టే ఇవి క్యాపిటల్ మార్కెట్ బాట పడుతున్నాయి. నిధులు అందాక మళ్లీ లోన్ల జారీని మొదలుపెట్టాలని భావిస్తున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మూలధనం కోసం బ్యాంకులు ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గించుకోవాలని, మార్కెట్లకు వెళ్లాలని సూచించారు. ఆర్థిక, నిర్వహణపరమైన విధులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు మదింపు విధానాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. ఇందుకోసం బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో ఒక విధానాన్ని తయారు చేస్తోందని వెల్లడించారు.