అమెరికా టారిఫ్‌‌‌‌లతో ఎంఎస్‌‌‌‌ఎంఈలకు తీవ్ర నష్టం

అమెరికా టారిఫ్‌‌‌‌లతో ఎంఎస్‌‌‌‌ఎంఈలకు తీవ్ర నష్టం
  • టెక్స్‌‌‌‌టైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో 70 శాతం ఇటువంటి కంపెనీలే

కోల్‌‌‌‌కతా: అమెరికా విధించిన అదనపు టారిఫ్‌‌‌‌లు భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌‌‌‌ఎంఈల)పై తీవ్ర ప్రభావం చూపనున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌లో పేర్కొంది. ఎంఎస్‌‌‌‌ఎంఈలు భారత ఎగుమతుల్లో సుమారు 45శాతం వాటా కలిగి ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం  భారత వస్తువులపై 25శాతం డ్యూటీ విధిస్తోంది.

మరో 25శాతం అదనపు టారిఫ్‌‌‌‌ను ఆగస్టు 27 నుంచి అమలు చేయనుంది. మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరడం వల్ల అనేక రంగాలు ప్రభావితమవుతాయి. అమెరికాకు భారత్ జరిపే ఎగుమతులలో 25 శాతం వాటా టెక్స్‌‌‌‌టైల్, రత్నాలు, ఆభరణాలది ఉంది. ఈ రంగాల్లో ఎంఎస్‌‌‌‌ఎంఈల  వాటా 70 శాతానికి పైగా ఉండటంతో, వీటిపై తీవ్ర ప్రభావం ఉంటుందని క్రిసిల్ రిపోర్ట్‌‌‌‌ పేర్కొంది.

కెమికల్స్ రంగంలో ఎంఎస్‌‌‌‌ఎంఈల వాటా 40శాతం ఉండటంతో ఇది కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వజ్రాలు భారత జెమ్స్ అండ్ జ్యువెలరీ  ఎగుమతుల్లో 50శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి.  ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌కు అమెరికా ప్రధాన వినియోగ మార్కెట్‌‌‌‌. అమెరికా నుంచి  తక్కువ టారిఫ్‌‌‌‌లు ఎదుర్కొంటున్న జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలతో కెమికల్స్ రంగంలో ఇండియా తీవ్ర పోటీ ఎదుర్కోనుంది. 

స్టీల్ రంగంలో మాత్రం ఎంఎస్‌‌‌‌ఎంఈలు ఎక్కువగా రీరోలింగ్‌‌‌‌ తయారీలో ఉండటంతో ప్రభావం తక్కువగా ఉంటుందని  అంచనా. టెక్స్‌‌‌‌టైల్ రంగంలో రెడీమేడ్ సెగ్మెంట్‌‌‌‌, తక్కువ టారిఫ్‌‌‌‌లను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల నుంచి పోటీ ఎదుర్కోనుంది.