
- రెగ్యులర్‌గా తైబజార్ వసూళ్లు, 53 వారాలుగా జమ కాని సంత డబ్బులు
- ఏడాదిగా రూ.3.36 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు
- స్థల వివాదంలో కోర్టు తీర్పుతో మున్సిపాలిటీ ఆదాయానికి గండి
వనపర్తి/పెబ్బేరు, వెలుగు: రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సమకూర్చే వారాంతపు సంతల్లో వనపర్తి జిల్లా పెబ్బేరు ఒకటి. ఈ సంత ద్వారా పెబ్బేరు మున్సిపాలిటీకి ఏడాదికి రూ.3.45 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇది టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి వచ్చేది. క్షేత్ర స్థాయిలో ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తుండడంతో కాంట్రాక్టర్లకు ఐదు రెట్లు అధికంగా ఆదాయం వస్తోంది. పెబ్బేరులో ప్రతి శనివారం జరిగే సంతలో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లతో పాటు చిరువ్యాపారాలు నిర్వహిస్తుంటారు.
పశువులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాల కోసం జిల్లాతో పాటు సమీప ఏపీ, కర్నాటక నుంచి వ్యాపారులు, ప్రజలు వస్తుంటారు. సంత జరిగే స్థలం వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించింది కావడం, ఈ స్థలం విషయంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో పూజారుల పక్షాన కోర్టు తీర్పు రావడంతో 53 వారాలుగా కాంట్రాక్టర్లు సంత తాలూకు ఫీజును మున్సిపాలిటీకి చెల్లించడం లేదు.
కోర్టు తీర్పుతో..
పెబ్బేరులోని వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 30.19 ఎకరాలలో 16 ఎకరాలలో కొన్నేళ్లుగా ప్రతి శనివారం సంతను నిర్వహిస్తున్నారు. ఆలయ స్థలాన్ని సంత జరిపేందుకు మున్సిపాలిటీకి ఇస్తే అంతే విలువైన స్థలాన్ని మరో చోట చూపిస్తామని గతంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హయాంలో సంత పరిరక్షణ సమితి చెప్పగా, ఆలయ పరిరక్షణ కమిటీ అంగీకరించింది. తహసీల్దార్ పేరు మీద 12.20 ఎకరాల స్థలాన్ని మార్పిడి చేశారు.
అయితే ఎంతకూ స్థలం చూపకపోవడంతో వేణుగోపాలస్వామి ఆలయ పూజారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు పూజారులకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో సంతలో జరిగే క్రయవిక్రయాలకు సంబంధించి ఎలాంటి టెండర్ నిర్వహించవద్దని మున్సిపల్ అధికారులు నిర్ణయించారు.
అయినప్పటికీ సంతలో కాంట్రాక్టర్లు ఫీజు వసూళ్లు ఆగడం లేదు. ఏడాదిగా కాంట్రాక్టర్లు సంతలో ఫీజు వసూలు చేస్తూ, మున్సిపాలిటీకి డబ్బులు జమ చేయడం లేదు. సంతలో వసూలు చేసిన ఫీజును ఒక బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి జమ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మూడు నెలలుగా అకౌంట్లోనూ డబ్బులు జమ చేయడం లేదని తెలిసింది. రూ.లక్షల్లో ఫీజు వసూలు చేసి కాంట్రాక్టర్లు తమ సొంతానికి వాడుకుంటున్నారని, కొందరు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
కోర్టు తీర్పు దృష్ట్యా మున్సిపాలిటీ ఆ డబ్బులు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో అడిగే వారెవరు లేరని కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. హైవే 44కు ఆనుకొని ఉన్న పెబ్బేరు పట్టణంలో అభివృద్ధి పనులు చేయాలంటే పెద్ద మొత్తంలో వచ్చే సంత ఫీజే ఆధారం. ప్రస్తుతం ఆ డబ్బులు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది.
వారానికి రూ.6.36 లక్షలు..
గతంలో టెండర్లు నిర్వహించగా వారానికి రూ.6.36 లక్షల చొప్పున మున్సిపాలిటీకి ఆదాయం సమకూరింది. తైబజార్, పశువులు, మేకలు, గొర్రెలకు విడివిడిగా కాంట్రాక్టర్లు ఉన్నారు. అంతా కలిసి సంత రోజు వసూలు చేసిన ఫీజులో నుంచి రూ.6.36 లక్షలు మున్సిపాలిటీకి చెల్లించేవారు. సంతలో వసూలు చేసిన ఫీజులో కాంట్రాక్టర్లకు 50 శాతం వరకు గిట్టుబాటయ్యేది. పేరుకు ముగ్గురు కాంట్రాక్టర్లే ఉన్నప్పటికీ, ఒక్కో కాంట్రాక్టర్ కింద సబ్ కాంట్రాక్టర్లతో కలిపి 335 మంది వరకు ఉంటారు.
5 నెలల కింద ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సంత స్థలం విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటామని, త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పినా అడుగు ముందుకు పడలేదు. ఇదిలాఉంటే ఏడాదికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నా, వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ధిపై చూపడం లేదని పట్టణ ప్రజలు అంటున్నారు.