
- నాలుగో క్వార్టర్లో రూ. 5,004 కోట్లు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ 2024–-25 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ఫలితాలను గురువారం ప్రకటించింది. మార్చి క్వార్టర్లో బ్యాంకు నికర లాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 33.15శాతం పెరిగి రూ. 5,002.66 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 3,757.23 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) స్వల్పంగా 1.44శాతం తగ్గి రూ. 9,442 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం 9.78శాతం పెరిగి రూ. 37,352.80 కోట్లకు చేరుకుంది.
నిర్వహణ లాభం 12.14శాతం వృద్ధితో రూ. 8,284 కోట్లుగా నమోదయింది. బ్యాంకు బోర్డు 2025 ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. నాలుగు డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. ఆస్తి నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.94శాతానికి తగ్గింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో 4.23శాతంగా ఉంది. నికర నిరర్థక ఆస్తులు నిష్పత్తి కూడా 0.70శాతానికి మెరుగుపడింది. గత ఏడాది ఇది 1.27శాతంగా ఉంది.