ఎన్నికల సిబ్బందికి లాంగ్​ లీవ్స్ రద్దు

ఎన్నికల సిబ్బందికి లాంగ్​ లీవ్స్ రద్దు
  •      హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్
  •     ప్రకటనలకు ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తప్పనిసరి

హైదరాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ ఉపఎన్నికల డ్యూటీ చేసే సిబ్బందికి లాంగ్​లీవ్స్ రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు వెంటనే ఎన్నికల విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. విదేశీ ప్రయాణాల కోసం అనుమతులు తీసుకున్నవారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆదేశించారు. అలాగే ఎలక్ట్రానిక్, లోకల్ కేబుల్, సోషల్ మీడియా, ఇతర ఆన్ లైన్ మాధ్యమాల్లో ప్రకటనలు, ఆడియో, ఎఫ్.ఎం రేడియోలో ప్రకటనలు, బల్క్ ఎస్.ఎం.ఎస్ లు

వీడియో మెసేజ్ లు, సినిమా థియేటర్లలో ప్రకటనలు, పోస్టర్ల ప్రింటింగ్ కు ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రోనాల్డ్ రోస్ తెలిపారు. బల్దియా హెడ్డాఫీసులోని సీపీఆర్ఓ ఆఫీసులో ఎంసీఎంసీ కమిటీ  ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రకటనల కోసం 48 గంటల ముందు అప్లయ్​చేసుకోవాలన్నారు. అభ్యర్థి గానీ, తన ఏజెంట్ గానీ అప్లై చేసుకోవచ్చన్నారు. 

బల్దియా హెడ్డాఫీస్ ​విజిట్​

ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నోడల్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించాలని వ్యయ పరిశీలకులు సెంథిల్ కుమారన్,అమిత్ శుక్లా సూచించారు. శుక్రవారం వారు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ హెడ్డాఫీసును సందర్శించారు.  జిల్లా ఎన్నికల అధికారి, సీపీ,రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, ఎన్​ఫోర్స్​మెంట్​నోడల్​అధికారులతో సమావేశమయ్యారు. అధికారుల విధులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను రోనాల్డ్ రోస్ వారికి వివరించారు.