- 70 శాతం వరకు తగ్గనున్న రేట్లు
- ధరలపై 30శాతం మార్జిన్ లిమిట్
- వచ్చే నెల 9 నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా కుదేలవుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. క్యాన్సర్ చికిత్సలో వాడే ఏకంగా 137 రకాల నాన్-షెడ్యూల్డ్ మందులపై డిస్ట్రిబ్యూటర్లు, హాస్పిటల్స్ విధించే ట్రేడ్ మార్జిన్ను గరిష్టంగా 30 శాతానికి పరిమితం చేస్తూ నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నిపుణుల కమిటీ (డీజీహెచ్ఎస్) సిఫార్సుల మేరకు ట్రేడ్ మార్జిన్ రేషనలైజేషన్ (టీఎంఆర్) విధానం ద్వారా ఈ పరిమితిని విధించారు. ఈ నిబంధనలు వచ్చే నెల (నవంబర్) 9 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీంతో మార్కెట్లో ఆయా మందుల రిటైల్ ధరలు (ఎంఆర్పీ) ఏకంగా 70 శాతం వరకు తగ్గే అవకాశముంది.
కేరళ హైకోర్టు పోరుతో కదలిక
గతంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే 'రిబోసిక్లిబ్' వంటి పేటెంటెడ్ మందుల అధిక ధరలపై కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యులకు జీవించే హక్కును గుర్తుచేస్తూ, ప్రాణాలను కాపాడే మందులను అధిక లాభాలకు అమ్ముతున్న ఫార్మా కంపెనీల దోపిడీని నియంత్రించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమగ్ర పరిశీలన జరిపి మార్జిన్లపై 30 శాతం పరిమితి నిర్ణయాన్ని అమలులోకి తెచ్చింది. గతంలో 2019లోనూ 42 క్యాన్సర్ మందులపై ఇదే తరహా పరిమితి విధించడంతో దాదాపు 526 బ్రాండ్ల ధరలు 90 శాతం వరకు తగ్గాయి.
హాస్పిటల్స్, రిటైల్ షాపులు.. అందరికీ ఒకటే రూల్
ఈ 30శాతం మార్జిన్ పరిమితి కేవలం హాస్పిటల్స్కే కాకుండా సాధారణ రిటైల్ మెడికల్ షాపులు, ఆన్లైన్ ఫార్మసీలన్నింటికీ సమానంగా వర్తిస్తుంది. తయారీదారులు స్టాకిస్టులకు ఇచ్చే ధరకు పైన మొత్తం వ్యాపార లాభాన్ని 30 శాతానికి పరిమితం చేయడంతో మందు డబ్బాపై ముద్రించే ఎంఆర్పీ గణనీయంగా తగ్గుతుంది. ఫార్మా కంపెనీలు తమ సవరించిన ధరల పట్టికను అధికారిక వెబ్సైట్లలో ప్రదర్శించడంతో పాటు హాస్పిటళ్లు, రిటైలర్లకు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా కొత్త ధరల కంటే అధికంగా వసూలు చేస్తే ఎన్పీపీఏ 'ఫార్మా సహీ దామ్' యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.
