
- త్రిముఖ పోరు ఉన్న చోట ఓటుకు రూ.6 వేల నుంచి 10 వేలు
- గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో పెద్ద ఎత్తున దావత్‌లు
- రేపు పోలింగ్.. ఈ రోజు రాత్రే కీలకం
హైదరాబాద్, వెలుగు : తమను గెలిపించాలంటూ ఇన్నాళ్లూ పోటాపోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు.. ఇప్పుడు పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టారు. ఓటర్లకు నగదు, మద్యం పంచడం షురూ చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పది రోజుల క్రితమే పంపకాలు మొదలుకాగా.. మంగళవారం రాత్రి నుంచి అన్ని నియోజకవర్గాల్లో జోరు పెంచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు నగదు పంపిణీ చేస్తుండగా, కొన్ని నియోజకవర్గాల్లో మిగతా పార్టీలకు దీటుగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో బీజేపీ క్యాండిడేట్లు బిజీగా ఉన్నారు. త్రిముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు సుమారు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లోనూ ఓటర్లకు ఈసారి భారీగా ముట్టజెప్తున్నట్లు సమాచారం.
విడతల వారీగా చెల్లింపులు
హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇవ్వడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5 వేల వరకు వస్తాయని ఓటర్లు ఆశిస్తున్నారు. గ్రేటర్శివార్లలోని నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు అభ్యర్థులు రూ.5 వేలు ముట్టజెప్తున్నారు. ఏరియాలను బట్టి కొందరికి ఫారిన్‌లిక్కర్, స్పెషల్ గిఫ్టులు కూడా ఇస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో పెద్ద ఎత్తున దావత్‌లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి విడత అని ఒక్కో ఓటరుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. ప్రత్యర్థులు పంచే మొత్తాన్ని బట్టి బుధవారం రాత్రి మరికొంత ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జనరల్ నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు ఇస్తున్నారు. ఈ జిల్లాలోని రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఇస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనరల్‌స్థానాల్లో మొదటి విడతగా రూ.వెయ్యి చొప్పున ఇస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్జిల్లాలో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టచెప్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని జనరల్‌స్థానాల్లో రూ.2 వేలు, రిజర్వుడ్స్థానాల్లో రూ.వెయ్యి వరకు ఇస్తున్నారు. గ్రేటర్సిటీలోని కాలనీల్లోనూ ఒక్కో ఓటుకు రూ.2 వేల వరకు పంపిణీ చేస్తున్నారు. అన్ని చోట్ల మందుతో విందులు ఇస్తున్నారు.
స్థానికంగానే డబ్బు సర్దుబాటు
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివార్లలో త్రిముఖ పోటీ ఉన్న సెగ్మెంట్లలో 3 పార్టీల అభ్యర్థులు కలిపి కేవలం ఓటర్లకే రూ.200 కోట్లకు పైగా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. కొన్ని చోట్ల మొదటి విడతగా రూ.2 వేల చొప్పున ఇచ్చిన లీడర్లు.. బుధవారం రాత్రి మరో విడతగా ఇస్తామని చెప్తున్నారు. ఓటర్లకు నగదు పంపిణీలో బీఆర్ఎస్అభ్యర్థులే ముందున్నారు. బీజేపీ అభ్యర్థులు కొన్ని చోట్ల పోటాపోటీగా ఇస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది మంగళవారం రాత్రి చెల్లింపులు మొదలు పెట్టారు. గురువారం పోలింగ్ఉండటంతో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున చేసే పంపకాలు కీలకం కానున్నాయి. ఇన్నాళ్లు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే మంగళవారం, బుధవారం రాత్రి చేసే పోల్ మేనేజ్‌మెంట్ ఒక ఎత్తు అని చెప్తున్నారు. ప్రధాన పార్టీల హెడ్ క్వార్టర్స్ నుంచి పెద్దలు అభ్యర్థులతో మాట్లాడుతూ ఎక్కడెక్కడ వీక్ ఉన్నారు.. ఎంత పంపిణీ చేయాలో ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నారు. హైదరాబాద్‌నుంచి నగదు తరలింపునకు ఆటంకాలు ఉండటంతో స్థానికంగానే డబ్బులు సర్దుబాటు చేస్తున్నారు. బడా వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లతో మాట్లాడి డబ్బు సర్దుబాటు చేయాలని, ఆ మొత్తానికి తాము గ్యారంటీ ఇస్తామని ఆయా పార్టీల ముఖ్యులు హామీ ఇస్తున్నారు. నగదు పంపిణీని అడ్డుకునేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తెల్లవారుజాము నుంచే..
హైదరాబాద్ లోని పలు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రత్యేకంగా కొన్ని బృందాలను పెట్టుకుని డబ్బుల పంపిణీ కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచే ఇంటింటికీ పోయి చేతిలో డబ్బులు పెట్టి వెళ్తున్నారు. ఇప్పటికే బూత్ స్థాయి కమిటీల ద్వారా ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించిన నేతలు.. కొందరికి ఫోన్ చేసి ఫలానా వారు వస్తారని చెప్తున్నారు. ఓటుకు రూ.1000 నుంచి రూ.2000 ఇచ్చి వెళ్తున్నారని కొందరు ఓటర్లు తెలిపారు. పగలయితే తెలిసిపోతుందనే కారణంతో.. మస్కులనే ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారు. అలా డబ్బు అందని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఉండే వారికి ఇవ్వట్లేదని మండిపడుతున్నారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్‌నగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్ తదితర నియోజక వర్గాల్లో పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ జరుగుతున్నట్టు సమాచారం.