గెలిచేదెవరు..బరిలో నిలిచేదెవరు..?

గెలిచేదెవరు..బరిలో నిలిచేదెవరు..?
  • ప్రజల్లోకి అధికార పక్ష నేతలు        
  • టికెట్ల వేటలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు

సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్​ అధికార పక్షం అభివృద్ధి కార్యక్రమాలు, చేరికలతో దూసుకుపోతోంది. కానీ కాంగ్రెస్, బీజేపీ నేతలు మాత్రం ఇంకా టికెట్ల వేటలో ఉన్నారు. ఈసారి సిద్దిపేట అసెంబ్లీ బరిలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, డీఎస్పీ అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. ఇక సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి హరీశ్​రావు పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే సిద్దిపేట నియోజవకర్గాన్ని చుట్టేస్తూ ఎక్కడ పార్టీ శ్రేణుల్లో స్తబ్ధత లేకుండా చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో క్రియాశీలక కార్యకర్తల్ని బీఆర్ఎస్ లో చేరే విధంగా పావులు కదుపుతున్నారు. మరోసారి రికార్డు మెజార్టీతో గెలుపొందే దిశగా కసరత్తు ప్రారంభించారు. 

బీజేపీ టికెట్​కోసం 21 దరఖాస్తులు

సిద్దిపేట అసెంబ్లీ బీజేపీ టికెట్ కోసం 21 మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ముఖ్యులంతా టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, గతంలో పోటీ చేసి ఓడిపోయిన నాయిని నరోత్తం రెడ్డి, విద్యాసాగర్,  బైరి శంకర్ ముదిరాజ్, ఉడుత మల్లేశం యాదవ్,  టీ. వెంకటేశం, పత్రి  శ్రీనివాస్,  కొత్తపల్లి వేణుగోపాల్ లతో మరో 14 మంది దరఖాస్తు చేసుకున్నారు.  చొప్పదండి విద్యాసాగర్ 2009, 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమిని పొందినా తిరిగి మరోసారి టికెట్ రేసులో ఉన్నాడు.  

ఢిల్లీలో కాంగ్రెస్ ఆశావహులు 

సిద్దిపేట కాంగ్రెస్ టికెట్ ను ఆశిస్తున్న కొందరు నేతలు ఢిల్లీలో మకాం వేసి లాబీయింగ్ చేస్తున్నారు. టికెట్ కోసం మొత్తం 15 మంది దరఖాస్తు చేసుకోగా అందులోంచి నలుగురి పేర్లతో ఫైనల్ జాబితాను కేంద్ర నాయకత్వానికి పంపినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో పేర్లున్న కొందరు ఢిల్లీలో తమకు తెలిసిన ముఖ్య నేతలను కలసి టికెట్ దక్కేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సిద్దిపేట టికెట్ కోసం శ్రీనివాస గౌడ్, దర్పల్లి చంద్రం, పూజల హరికృష్ణ, భవాని, కిరణ్ కుమార్, రఘువర్దన్ రెడ్డి, సూర్యచంద్ర వర్మ,  బి. యాదగిరి 

గంప మహేందర్ రావు,  మహ్మద్ ఖలీమొద్దీన్, దేవుల పల్లి యాదగిరి, జి. శ్రీనివాస్, మీసం నాగరాజు, మార్క సతీశ్​కుమార్,  శ్రీనివాస్​ముదిరాజ్ లు దరఖాస్తు చేసుకున్నారు. 2010, 2014 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాడూరి శ్రీనివాస గౌడ్ పోటీ చేసి ఓటమి పొందినా మరోసారి టికెట్ ప్రయత్నాల్లో ఉన్నాడు. టికెట్ రేసులో ఎక్కువ మంది బీసీలే ఉండటంతో సిద్దిపేట లో కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థి ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

ప్రత్యర్థులంతా కనుమరుగు

గత రెండు దశాబ్దాల కాలంగా హరీశ్ రావు పై పోటీ చేస్తూ వస్తున్న ప్రత్యర్థులంతా ఓటమి తరువాత క్రమంగా రాజకీయాల నుంచి దూరమవుతున్నారు. 2004 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటి సారి హరీశ్​రావు సిద్దిపేట నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి దుబ్బాక రాజకీయాల్లోకి వెల్లిపొయ్యారు. 2008 ఉప ఎన్నికతో పాటు, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ పోలీస్ అధికారి బైరి అంజయ్య సైతం పరాజయాల తరువాత రాజకీయాలకు దూరమయ్యారు.

2010 ఉప ఎన్నిక, 2014  ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తాడూరి శ్రీనివాస గౌడ్ పరాజయం పాలైనా తర్వాత పాలిటిక్స్​లో చురుకుగాఉండటం లేదు.  2008 లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎల్లు రవీందర్​రెడ్డి తరువాత బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టీజేఎస్​ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన భవాని రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండటం గమనార్హం.