కుల సంఘాల ఓట్లపై..స్పెషల్​ ఫోకస్​

కుల సంఘాల ఓట్లపై..స్పెషల్​ ఫోకస్​
  • మండలాలు, గ్రామాల వారీగా మీటింగ్‌‌లు 
  •     స్థలాలు, బిల్డింగ్ లకు నిధులు మంజూరు చేయిస్తామని హామీలు 
  •     గంపగుత్తగా ఓట్లు పొందేందుకు ట్రై చేస్తున్న పొలిటికల్​పార్టీలు

మెదక్, వెలుగు :  ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. మెజారిటీ ఓట్లు ఉన్న వివిధ కులాలు, సంఘాల మద్దతు కూడగట్టడంపై  ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గంప గుత్తగా ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థలాలు ఇప్పిస్తామని, సంఘ భవనాలకు నిధులు మంజూరు చేయిస్తామని హామీలు ఇస్తూ ఓట్లు పొందేందుకు ట్రై చేస్తున్నారు.

మెదక్, నర్సాపూర్ రెండు సెగ్మెంట్లలో ఏ కులానికి, వర్గానికి సంబంధించి ఎంతమంది ఓటర్లు ఉన్నారనే లెక్కలు తీస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే సంఘాలతో నియోజకవర్గ స్థాయిలో, మండలాల వారీగా, గ్రామాల వారీగా మీటింగ్‌‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని, అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు.  

ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజ్, మున్నూరు కాపులు, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే మేస్త్రీ, సెంట్రింగ్,  ప్లంబింగ్​ పనులు చేసే వారి సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో కిరాణ, వర్తక, హమాలీ సంఘాల వారితోనూ ఎన్నికల్లో మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. 

మెదక్ లో కృతజ్ఞత పభలు

మెదక్ పట్టణంలో ఇటీవల ఆర్యవైశ్య, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభలు నిర్వహించారు. ఆర్యవైశ్య సభకు బీఆర్ఎస్​ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరవగా, మున్నూరు కాపు సభకు ఆమెతోపాటు, మంత్రి గంగుల కమలాకర్​, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర హాజరయ్యారు. ఈ రెండు సభల్లోనూ ఆయా సంఘాలకు మెదక్ పట్టణంలో స్థలాలు కేటాయించి బిల్డింగ్​ల నిర్మాణానికి రూ.కోటి చొప్పున నిధులు కేటాయించిన విషయాన్నిప్రస్తావించి ఎన్నికల్లో మద్దతివ్వాలని మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు కోరడం గమనార్హం.

బీజేపీ అభ్యర్థుల బీసీ నినాదం

బీజేపీ మెదక్​, నర్సాపూర్​ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. ఇక్కడ ఓటర్లలో బీసీలే మెజారిటీగా ఉండడంతో మెదక్ క్యాండిడేట్​ పంజా విజయ్​ కుమార్, నర్సాపూర్​ క్యాండిడేట్​ మురళీ యాదవ్ ఎన్నికల ప్రచారంలో బీసీ నినాదంతో ముందుకు వెళుతున్నారు. బీఆర్​ఎస్, కాంగ్రెస్​ అభ్యర్థులు అగ్రవర్ణాలకు చెందిన వారేనని, బీసీల సమస్యలు తీరాలన్నా, ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా బీసీ ఎమ్మెల్యే  ఉంటేనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో తమను ఆదరించి గెలిపించాలని కోరుతున్నారు. ఆయా బీసీ సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 

మైనార్టీ, గిరిజన సమ్మేళనాలు

మైనార్టీ, గిరిజన ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్​ఎస్​ నర్సాపూర్ లో సమ్మేళనాలు నిర్వహించింది. మైనార్టీ  సమ్మేళనానికి రాష్ట్ర హోంమత్రి మహముద్​అలీ, గిరిజన సమ్మేళనానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ హాజరయ్యారు. ఆయా వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం గడచిన పదేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు.