
- పోలింగ్‌కు కొద్దిగంటలే సమయం
- ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అభ్యర్థుల ప్లాన్
- ముందుగానే మందు, మటన్‌కు భారీగా ఆర్డర్లు
- సిటీ శివారులో జోరుగా లిక్కర్ పార్టీలకు ఏర్పాట్లు
- ఐటీ ఎంప్లాయీస్, యూత్‌కు టూర్ ప్యాకేజీలు
హైదరాబాద్,వెలుగు : ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్‌కు కొద్ది గంటలే మిగిలి ఉంది. అభ్యర్థులు అప్రమత్తమయ్యారు. మంగళవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉండగా.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అంతకుముందుగానే ప్లాన్ చేశారు. సిటీ శివారు ప్రాంతాల్లో భారీ ఎత్తున లిక్కర్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఇందుకు శుక్రవారం నుంచే మటన్ కు ఆర్డర్స్ చేశారు. భారీగా మద్యాన్ని కొనుగోలు చేశారు. పోలింగ్ కు ఒకరోజు ముందుగా పంపిణీకి స్థానిక బూత్‌లెవల్ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. ఇక ఐటీ ఉద్యోగులు, యూత్ కు టూర్స్ ప్యాకేజ్ ఆఫర్ చేస్తుండగా.. గెలిచాక కోరిన ప్రాంతాలకు తీసుకెళ్తామని హామీలు ఇస్తున్నారు. ఇందుకు సెగ్మెంట్లో ఐటీ, ప్రయివేట్ ఉద్యోగులు, ఇంజినీరింగ్ స్టూడెంట్లను గ్రూపులుగా చేసి టీమ్ లీడర్‌ను కూడా నియమించారు.
టోకెన్ సిస్టమ్‌తో దావత్
అభ్యర్థుల కుటుంబ సభ్యులు, నమ్మకమైన అనుచరులకు ఈ బాధ్యతలు అప్పగించారు. సిటీ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మందు పార్టీలకు ఓటర్లను తరలించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను బుక్ చేశారు. ఇప్పటికే పలు రెస్టారెంట్లలో రూమ్స్ బుక్ చేశారు. వాటి పేరుతో టోకెన్స్ ఇస్తుండగా.. ఒక్కో టీమ్‌లో నలుగురిని, వీరిని మానిటరింగ్ చేసేందుకు బూత్‌లెవెల్ లీడర్లకు బాధ్యతలు ఇచ్చారు.