నాన్ లోకల్ ముంచింది.. సెంటిమెంట్ కలిసొచ్చింది

నాన్ లోకల్ ముంచింది.. సెంటిమెంట్ కలిసొచ్చింది
  •      ఒక్క అవకాశమంటూ సెంటిమెంట్​తో గెలిచిన అభ్యర్థులు
  •       మొదటిసారి అసెంబ్లీకి పాయల్​శంకర్, అనిల్​జాదవ్
  •      నాన్ లోకల్ ప్రచారంతో మరో రెండు చోట్ల నేతల ఓటమి

ఆదిలాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్​ సెంటిమెంట్లు కొందరికి కలిసి రాగా.. నాన్​లోకల్​అనే ప్రచారం కొందరి కొంప ముంచింది. దీనికి తోడు ఈసారైనా ఒక్క అవకాశమివ్వండనే సెంటిమెంట్ పలువురు అభ్యర్థుల తలరాతలను మార్చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు చోట్ల క్యాండెట్లు నాన్ లోకల్ అనే కారణంతో ఓడిపోయినట్లు తెలుస్తోంది.

ఖానాపూర్ లో కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్​కు నాన్ లోకల్ అనే ముద్ర పడటంతో ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. ఆసిఫాబాద్​లోనూ నాన్ లోకల్ అనే అంశం కాంగ్రెస్ అభ్యర్థిని దెబ్బతీసింది. ఇక ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో ‘ఒక్క అవకాశం’ అనే సెంటిమెంట్​ఈసారి వర్కౌట్​అయ్యి ఏండ్ల కృషి తర్వాత ఆ ఇద్దరు నేతలు ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

సెంటిమెంటుతో కొట్టారు..

ఈసారి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు సెంటిమెంట్​ను ప్రధాన అస్త్రంగా మార్చుకొని ప్రచారం చేశారు. ఈ అంశం పలువురికి కలిసొచ్చింది. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్, బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఇదే అంశంతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించారు. ఈ ఇద్దరూ మూడు పర్యాయాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి ఒక్క అవకాశమివ్వాలంటూ ప్రజలను కోరారు. ఎలాంటి పదవులు లేకపోయినా ఇంతకాలం ప్రజా సేవ చేస్తూ వస్తున్నానని

ఈసారైనా అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలని పాయల్​శంకర్ ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను వేడుకున్నారు. దీంతో ఆదిలాబాద్ నియోజకవర్గం చరిత్రలో ఏనాడూ గెలుపొందని బీజేపీ మొదటిసారి విజయం సాధించింది. అనిల్ జాదవ్ సైతం రెండు సార్లు కాంగ్రెస్ నుంచి, ఒకసారి ఇండిపెండెంట్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఓటములతో ఆయనకు ప్రజల్లో సానుభూతి పెరిగింది. నాలుగోసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న ఆయన ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకొని సక్సెస్​ అయ్యారు.

టికెట్ కేటాయింపు నుంచి నాన్ లోకల్ ముద్ర

ఖానాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖ నాయక్​ను కాదని.. కేటీఆర్ ఫ్రెండ్, ఎన్​ఆర్​ఐ జాన్సన్ నాయక్​కు బీఆర్​ఎస్ టికెట్ కేటాయించింది. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జాన్సన్ నాయక్​పై ప్రత్యర్థులు ‘నాన్ లోకల్’ అని ముద్ర వేసి, దాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకొని ప్రచారం చేశారు. జాన్సన్​కు టికెట్ కేటాయించినప్పటి నుంచి ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. జాన్సన్ గెలిస్తే స్థానికంగా ఉండ‌‌‌‌బోర‌‌‌‌ని, భవిష్యత్తులో సమస్యలు వస్తే చెబుతామనుకున్నా దొరకరంటూ ప్రచారం చేయడం ప్రత్యర్థులకు కలిసొచ్చింది.

దీంతో అధికార బీఆర్ఎస్ ఖానాపూర్ సిట్టింగ్ సీటును కోల్పోయింది. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖ నాయక్ కాంగ్రెస్​లో చేరి టికెట్ ఆశించారు. కానీ బొజ్జు పటేల్​కు టికెట్​ఇచ్చిన కాంగ్రెస్.. ఆసిఫాబాద్ టికెట్​ను ఆమె భర్త శ్యామ్​నాయక్​కు కేటాయించింది. అయితే ఇక్కడ కూడా ఆయనపై నాన్ లోకల్ అనే ప్రచారం బలంగా జరిగింది. దీంతో స్థానిక ఆదివాసీ లీడర్ బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి చేతిలో ఆయనకు ఓటమి తప్పలేదు.