V6 News

ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. విమాన చార్జీలపై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్.. విమాన చార్జీలపై మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

శుక్రవారం ( డిసెంబర్ 12 ) పార్లమెంట్ లో మాట్లాడుతూ విమాన చార్జీల పెరుగుదలపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏడాది పొడువునా విమాన టికెట్ ధరలపై పరిమితి విధించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఇండిగో సంక్షోభంపై చర్చ సందర్భంగా విమాన టికెట్ ధరలు నియంత్రించాలంటూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై స్పందించిన ఆయన ఈమేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఫ్లైట్ టికెట్ చార్జీల డీ రెగ్యులరైజేషన్ వల్ల సివిల్ ఏవియేషన్ రంగానికి, కస్టమర్లకు కూడా ప్రయోజనం ఉంటుందని అన్నారు. డీ రెగ్యులరైజేషన్ ఉన్నప్పుడే కొత్త సంస్థలు విమానయానరంగంలో ప్రవేశించటానికి అవకాశం ఉంటుందని అన్నారు రామ్మోహన్ నాయుడు. పండగల సీజన్ లో టికెట్ ధరలు పెరగడం సహజమేనని.. అయితే, ఆయా సంస్థలు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు రామ్మోహన్ నాయుడు.

విమాన టికెట్ చార్జీల విషయంలో అవసరమైనప్పుడు కేంద్రం తప్పకుండా జోక్యం చేసుకుంటుందని.. కంపెనీలు అధికార దుర్వినియోగానికి పాల్పడితే కేంద్రం జోక్యం చేసుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయని అన్నారు. కరోనా, పహాల్గమ్ ఉగ్రదాడి, కుంభమేళా వంటి సమయాల్లో విమాన టికెట్ ధరలు పెరిగితే.. కేంద్రం జోక్యం చేసుకుందని అన్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్రం తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి టికెట్ ధరలు కంట్రోల్ చేస్తుందని అన్నారు రామ్మోహన్ నాయుడు.