అప్పులు తెచ్చుకోనియ్యాలె

అప్పులు తెచ్చుకోనియ్యాలె

ఎఫ్​ఆర్​బీఎం పరిమితులొద్దు
పూర్తిస్థాయి మాన్యుఫాక్చరింగ్‌‌ ఇక్కడే జరగాలి
కేంద్రం ధైర్యంగా కొత్త నిర్ణయాలు తీసుకోవాలి
అట్లయితేనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యం
ఆర్థికసంఘం సిఫార్సులతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం
తెలంగాణ రూ.4వేల కోట్ల వరకు కోల్పోతుంది
ముంబైలో నాస్కామ్ టెక్నాలజీ లీడర్‌‌షిప్ ఫోరమ్‌‌లో మంత్రి కేటీఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగుకేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’ స్లోగన్ కాస్తా ‘అసెంబ్లింగ్ ఇన్ ఇండియా’గా మారిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. పూర్తి స్థాయి మాన్యుఫాక్ఛరింగ్‌‌ ఇక్కడే జరిగేలా తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వంటి భారీ టార్గెట్‌‌ అందుకోవాలంటే ధైర్యంగా కొత్తకొత్త నిర్ణయాలను తీసుకోవాలని, అయితే దేశప్రజల ఆకాంక్షల మేరకు కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయిందన్నారు.

మరోవైపు 15వ ఆర్థిక సంఘం తన సిఫార్సుల్లో అభివృద్ధిలో ముందుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రాల వాటాను తగ్గించడం వాటిని నిరుత్సాహపరచడమేనన్నారు. మానవవనరులు, అక్షరాస్యత, హెల్త్‌‌ కేర్‌‌లో మెరుగ్గా ఉన్నప్పటికీ 42శాతం నుంచి 41 శాతానికి వాటా తగ్గించడం ఆ రాష్ట్రాలు నిధులు కోల్పోయేలా శిక్షించడమే అని విమర్శించారు. దీని ప్రభావం తెలంగాణపై రూ.4 వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఫార్మాసిటీ, వరంగల్‌‌ టెక్స్‌‌ టైల్‌‌ పార్క్‌‌ లాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న వాటికి సాయం కోరినా కేంద్రం సపోర్ట్‌‌ చేయలేదు.. ఇలాంటప్పుడు భారీ ఎకానమీ ఎలా సాధ్యమైంతుందని ప్రశ్నించారు. ముంబైలో జరుగుతున్న‘నాస్కామ్ టెక్నాలజీ లీడర్‌‌షిప్ ఫోరమ్-2020’ ప్రోగ్రాంకు శుక్రవారం కేటీఆర్‌‌ హాజరయ్యారు. ‘మార్చ్ టూ 5 ట్రిలియన్ డాలర్ ఏకానమీ: రియాలీటీ ఆర్ అంబిషియస్’ అంశంపై టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్నాని నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.

తెలంగాణ లాంటి రాష్ట్రాల విధానాలు, వనరులు, వాతావరణం నచ్చి పెట్టుబడి పెట్టేందుకు ముందు కు వచ్చే విదేశీ కంపెనీలు, ఆర్థిక సంస్థలకు కఠినమైన కేంద్రం రూల్స్‌‌ అడ్డంకిగా మారాయన్నారు. వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాలకు పెద్ద ప్రాబ్లమ్‌‌గా మారిన పెట్టుబడి లభ్యత సమస్య తీర్చేందుకు ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పరిమితులను సవరించాలన్నారు. రాష్ట్రాలకు మరింత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. సేవారంగం, టూరిజం, హెల్త్ కేర్, విద్యారంగం మొదలైన వాటిలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి… ఉమ్మడి జాబితాలోని అనేక అంశాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని పేర్కొన్నారు. టీమ్ ఇండియా, ఫెడరల్ వంటి పదాలను అచరణలో చూపాల్సిన సమయం వచ్చిందని, ఫిస్కల్ ఫెడరలిజాన్ని అనుసరించాలని
సూచించారు.

బోల్డ్‌‌ డిసిషన్స్‌‌ తీసుకోవాలె..

డెవలప్‌‌మెంట్‌‌ ప్రోగ్రామ్స్‌‌ కోసం పెద్దఎత్తున ఫండ్స్‌‌ ఖర్చు చేయకపోతే 5 ట్రియలియన్ డాలర్ల ఎకానమీ సాధించడం సవాలేనన్నారు. రెండు మూడేళ్లుగా దేశ ఎకానమీ స్లో అయిందని..  కేం ద్రం ఒప్పుకున్నా, ఒప్పుకోపోయినా ఆర్థిక లెక్కలు ఇదే విషయాన్ని చెబుతున్నాయని వివరించారు. ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కేంద్రం ధైర్యంగా బోల్డ్‌‌ డెసిషన్స్‌‌ తీసుకోవాలన్నారు. అమెరికా, జపాన్, యూరప్‌‌లోని పలుదేశాల లెక్క చౌకగా పెట్టుబడిని సేకరించి ఖర్చు చేయాలన్నారు. సెంట్రల్‌‌ ఫైనాన్స్‌‌ రూల్స్‌‌ ఈజీ చేయడం, ఇతర విధానాల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రయారిటీ ఇవ్వాలన్నారు. రూల్స్‌‌ ఈజీగా ఉంటనే మాన్యుఫాక్చరింగ్‌‌లో మనం ఇతర దేశాలతో పోటీ పడగలమన్నారు.

పెద్ద ప్రాజెక్టులకు కేంద్రం సపోర్ట్‌‌ చేయలె

ఎకానమీ భారీగా వృద్ధి చెందాలంటే పెద్దపెద్ద ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి. ఇందులో భాగంగానే తెలంగాణ భారీగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు, ప్రపంచంలోనే పలు అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదారాబాద్ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ టెక్స్ టైల్ పార్కుల ఏర్పాటుతో ప్రపంచంతో పోటీ పడేందుకు రెడీ అవుతోందన్నారు. ఆ ప్రాజెక్టులకున్న ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర సహకారం కోరినా ఏమాత్రం సపోర్ట్‌‌ ఇవ్వలేదన్నారు. ఆ ప్రాజెక్టులను పట్టించుకోనప్పుడు భారీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు.

ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ..

ఫేమస్‌‌ సిటీలు మౌలిక వసతుల సంక్షోభం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను విస్తరించాలని మంత్రి కేటీఆర్‌‌ కోరారు. ఇందుకోసం నాస్కామ్ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. దీంతో కంపెనీల నిర్వహణ ఖర్చు తగ్గడంతోపాటు, ఆయా నగరాల్లో ఉన్న అద్భుతమైన టాలెంట్, మానవ వనరులను ఉపయోగించుకునే అవకాశం కలుగుతుందన్నారు. వరంగల్‌‌లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు మంచి స్పందన వస్తోందని, మరిన్ని కంపెనీలు రావాలని కోరారు. అలాగే వ్యవసాయ రంగలో ఆదాయం రెట్టింపు చేసే దిశగా తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు.

త్రీ ఐతో కొత్త ఇండియా నిర్మాణం..

గతంలో ప్రధాన మోడీతో జరిగిన మీటింగ్‌‌లో దేశాభివృద్ధికి త్రీ ఐ(3I) మంత్రా పాటించాలని సూచించిన విషయాన్ని కేటీఆర్‌‌ గుర్తు చేశారు. ఇన్నోవేషన్, ఇన్ ప్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ ద్వారా నయా భారత్ నిర్మాణం సాధ్యం అవుతుందని కేటీఆర్‌‌ తెలిపారు. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ కొత్త ఆలోచనలు చేయాలని, ఈ రంగంలో తెలంగాణ టీ-హబ్ అనే భారీ ఇంక్యూబేటర్‌‌ను నెలకొల్పిందని పేర్కొన్నారు. నిర్మాణరంగం అనుకున్నంత విస్తరించడం లేదన్నారు. ఈ రంగంలో 2014కి ముందు తెలంగాణలో కేవలం సుమారు 50వేల కోట్లు ఖర్చు చేస్తే, తాము అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే సుమారు లక్షా 60 వేల కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను చేపట్టి ఆర్థిక ప్రగతికి పాటు పడుతున్నామన్నారు. దీంతోపాటు పట్టణాలు, గ్రామాల మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా డెవలప్‌‌ కావాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తల కోసం