పహల్గాం ఉగ్రదాడిని మర్చిపోకండి: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

పహల్గాం ఉగ్రదాడిని మర్చిపోకండి: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్‎ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రస్తుత వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, పహల్గామ్ దాడి వంటి సంఘటనలను విస్మరించలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఎనిమిది వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసు జారీ చేసింది.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను రెండు నెలల్లో పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని 2024లో విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక-రాజకీయ కార్యకర్త ఖుర్షాయిద్ అహ్మద్ మాలిక్ దాఖలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో ఇంకా ఆలస్యం జరిగితే అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వ ప్రభావం తీవ్రంగా తగ్గిపోతుందని, ఇది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమైన సమాఖ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.

ఈ పిటిషన్లను గురువారం (ఆగస్ట్ 14) భారత చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్‎లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియలో అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని వాదించారు. 

తుషార్ మెహతా వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. జమ్మూ కాశ్మీర్‎లోని ప్రస్తుత పరిస్థితులను పిటిషనర్లు కూడా పరిగణలోకి తీసుకోవాలని.. ఇటీవల అక్కడ జరిగిన పహల్గాం ఉగ్రదాడిని విస్మరించలేమని పేర్కొంది ధర్మాసనం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై తమ వైఖరేంటో 8 వారాల్లోగా స్పష్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అనంతరం విచారణను 8 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. 

2019, ఆగస్ట్ 5న జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది కేంద్రం. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2023, డిసెంబర్ 11న ఆ పిటిషన్లు తోసిపుచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం.  

ఏకగ్రీవంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దును సమర్థించింది సుప్రీంకోర్టు. ఇదే సమయంలో 2024  సెప్టెంబర్ నాటికి కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, దాని రాష్ట్ర హోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో జమ్మూ కాశ్మీర్‌కు రెండు నెలల్లో రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2024లో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.