మిడ్​ డే మీల్స్​ పెడ్తలేరు

మిడ్​ డే మీల్స్​ పెడ్తలేరు
  • ఇంటర్, డిగ్రీ స్టూడెంట్ల ఎదురుచూపులు 
  • గతేడాదే స్టార్ట్ చేస్తామన్న సీఎం కేసీఆర్ 
  •  కొవిడ్ పేరుతో  పక్కన పెట్టిన సర్కారు 
  •  ఈ ఏడాదీ ఇప్పటికీ సప్పుడు లేదు 

ఈ ఏడాది నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినం. ఉదయం కాలేజీలకు వచ్చిన స్టూడెంట్లు భోజనం సమస్యతో మధ్యాహ్నమే తిరిగి వెళ్లిపోతున్నారు. కాలేజీల్లో డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు, స్టూడెంట్లకు పౌష్టికాహారం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం.
                                                                                                                                                                                              - 2020 జులై 17న  సీఎం కేసీఆర్ ప్రకటన
    

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ పెడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా ఊరిస్తోంది. గతేడాదే తప్పకుండా స్టార్ట్ చేస్తామని సీఎం కేసీఆర్​ప్రకటించారు. చివరికి కొవిడ్ ను కారణంగా చూపి వాయిదా వేశారు. ఈ ఏడాది కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు మొదలై  నెలరోజులు అవుతున్నా మిడ్ డే మీల్స్ అమలు చేసే సూచనలేం కన్పించడం లేదు. దీంతో స్టూడెంట్లలో ఆందోళన మొదలైంది. తెలంగాణలో 405 సర్కారీ జూనియర్ కాలేజీల్లో 1.95 లక్షల స్టూడెంట్లున్నారు. 132 డిగ్రీ కాలేజీల్లో 1.4 లక్షల దాకా చదువుతున్నారు. కరోనా దెబ్బకు గతేడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొద్ది రోజులే ఫిజికల్ క్లాసులు జరిగాయి. దాంతో మిడ్ డే మీల్స్ ఆలోచన కూడా సర్కారు చేయలేదు. 2021–22 విద్యా సంవత్సరం మొదలై మూడు నెలలు కావస్తోంది. సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఫిజికల్ క్లాసులు కూడా మొదలయ్యాయి. అయినా ఈ ఏడాది కూడా స్కీమ్ అమలు చేస్తారో లేదో స్పష్టత లేదు.
అడ్మిషన్లు పెరిగినై
సీఎం కేసీఆర్ హామీ మేరకు అడ్మిషన్ల ప్రచారంలో మధ్యాహ్న భోజనాన్ని కూడా లెక్చరర్లు చేర్చారు. కాలేజీలకొస్తే భోజనం ఉంటుందని చెప్తూ అడ్మిషన్లు చేశారు. దాంతో ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఇంటర్ ఫస్ట్​ఇయర్లో 1.11 లక్షలు, డిగ్రీ ఫస్టియర్​లో 50 వేల దాకా చేరారు. ఈ కాలేజీల్లో చదివేది చాలావరకు పేద స్టూడెంట్లే. కేసీఆర్ మాటలతో కాలేజీల్లో తమకు మధ్యాహ్న భోజనం దొరుకుతుందన్న భరోసా వారిలో కన్పించిందని లెక్చరర్లు చెబుతున్నారు. కానీ అదింకా అమలు కావడం లేదు. పైగా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు సరిగా నడవటం లేదు. దాంతో ఉదయం కాలేజీలకు వచ్చిన స్టూడెంట్లు రాత్రి ఇల్లు చేరేదాకా ఖాళీ కడుపుతో ఉంటున్నారు.
మూడేండ్ల నుంచీ ఊరింపే
సర్కారు జూనియర్​కాలేజీల్లో మిడ్ డే మీల్స్ పెడతామని మూడేండ్ల కింద కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం 2018లో అప్పటి విద్యా మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, మోడల్‌ జూనియర్‌ కాలేజీల్లోని 4 లక్షల మందికి స్కీమ్ అమలు చేస్తామని ప్రకటించారు. అయినా ఇప్పటిదాకా ఏ కాలేజీలోనూ పథకం మొదలు కాలేదు.

వెంటనే స్టార్ట్ చేయాలె
ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ స్టార్ట్ చేస్తామని ప్రగతిభవన్ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. దాంతో అడ్మిషన్లప్పుడు లెక్చరర్లు ఇదే విషయాన్ని పేరెంట్స్​కు చెప్పారు. అందుకే ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు లక్ష దాటాయి. సర్కారు ఏం చెప్పకపోవడంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతు న్నారు. చర్యలు మొదలు పెట్టాలి.  
                                                                                                                                                                      - మధుసూదన్​రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్