
- తీర్మానాన్ని అడ్డుకున్న నామినేటెడ్ సభ్యుడు
- అతనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఉద్యోగులు
- వాడీవేడిగా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్
కంటోన్మెంట్, వెలుగు : ఉద్యోగుల ఇంటి స్థలాలు, అక్రమ నిర్మాణాలకు పెనాల్టీ అంశాలపై కంటోన్మెంట్ బోర్డుపాలక మండలి సమావేశం వాడీవేడిగా సాగింది. శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిఫెన్స్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన మీటింగ్ లో బోర్డు సభ్యులు పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. కొన్నింటికి బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అభ్యంతరం లేవనెత్తారు. హస్మత్పేటలోని 28ఎకరాల స్థలాన్ని బోర్డు ఉద్యోగులకు కేటాయించాలని సీఈఓ మధుకర్నాయక్ ప్రతిపాదించగా, నామినేటెడ్సభ్యుడు వ్యతిరేకించారు.
రూ. కోట్ల విలువైన స్థలాన్ని ఎలా ఉద్యోగులకు కేటాయిస్తారని, రిటైర్డ్ఉద్యోగులకు కూడా ఇళ్లస్థలాలు కేటాయిస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. దీంతో వాయిదా వేశారు. కంటోన్మెంట్బోర్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మహేందర్ అనంతరం రామకృష్ణతో వాగ్వాదానికి దిగారు. 500 మంది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని రామకృష్ణపై అసహనం వ్యక్తం చేస్తూ నిలదీశారు.
మరోవైపు అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసేందుకు బోర్డు ప్రతిపాదించగా నామినేటెడ్ సభ్యుడు అడ్డుకోగా పెండింగ్ పెట్టారు. బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, ఎమ్మెల్యే లాస్య నందిత, సీఈఓ మధుకర్నాయక్, జాయింట్ సీఈఓ ఆకాశ్కుమార్శర్మ పాల్గొన్నారు. బోర్డు అభివృద్ధికి సీఎం హామీపై ధన్యవాదాలు తెలిపారు.