ఎస్సారెస్పీ ముంపు గ్రామాల్లో అధికార పార్టీ నేతల కబ్జాలు

ఎస్సారెస్పీ ముంపు గ్రామాల్లో అధికార పార్టీ నేతల కబ్జాలు
  •     ఆనవాళ్లు లేని పునరావాస గ్రామాలు
  •      చెట్టుకొకరుగా  వెళ్లిపోయిన గ్రామస్తులు
  •      కన్నెత్తి చూడని  రెవెన్యూ ఆఫీసర్లు 

జగిత్యాల, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నష్టపోయిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలానికి చెందిన గంగ సముందర్, సిరిపురం, నూత్ పల్లి డొంకేశ్వర్, కొమన్ పల్లి,  గాదేపల్లి, మగ్గిడి గ్రామస్తులకు 1978లో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎరియాలో పునరావాసం కల్పించారు. గ్రామస్తులకు కుటుంబానికి రెండెకరాల భూమి, 2-4 గుంటల స్థలం ఇచ్చారు. వీటిని ఎస్సారెస్పీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షించారు. 30 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న ఈ గ్రామస్తులకు గత ఐదారేళ్లుగా కబ్జాల భయం పట్టుకుంది. అధికార పార్టీ లీడర్లు కొందరు వ్యవసాయ భూములు, ప్లాట్ల కబ్జాలు, బెదిరిపులకు దిగారు. దీంతో చేసేదేం లేక వచ్చిన రేట్లకే ప్లాట్లు, భూములు అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో  ఇప్పటికే మగ్గడి గ్రామం ఖాళీ కాగా, గంగ సముందర్ గ్రామంలో 70 కుటుంబాలకు 4 కుటుంబాలే మిగిలాయి.  

ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా..

పునరావాస గ్రామం గంగ సముందర్ గ్రామం ఏర్పాటుతో 70 దళిత కుటుంబాలు వలస వచ్చాయి. గతంలో ఇక్కడ మాగాల అమావాస్య రోజు పోచమ్మ జాతర, రథసప్తమి నాడు హనుమాన్ జాతర జరిగేది. అయితే 8 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొందరు ఇక్కడి భూములు కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆట స్థలం, దేవాలయానికి, రోడ్డు కోసం కేటాయించిన స్థలాలు కబ్జా అయ్యాయి. విచిత్రమేమిటంటే ప్రస్తుతం నివాసం ఉన్న ఇంటి ఎదుట కూడా కబ్జా చేసి పొలం వేసేందుకు చదును చేశారు. గ్రామ అవసరాల కోసం కట్టిన బావులను కూడా వాడుకోనివ్వకుండా కబ్జా చేసి పొలాలు చేస్తున్నారు. వారి వేధిపులు భరించలేక చాలామంది వచ్చిన రేటుకు ఇల్లు, పొలాలు అమ్ముకుని వెళ్లిపోతున్నారు. అలాగే గంగాసముందర్ గ్రామానికి కేటాయించిన స్కూల్ స్థలంలో ఎమ్మార్వో ఆఫీస్ ఉంది. అక్రమార్కులు ఇంత తంతు జరుపుతున్నా రెవెన్యూ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.   

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు ఓ మహిళది. చుట్టూ ఉన్న స్థలంలో లే అవుట్ ప్రకారం ప్లాట్స్ ఏర్పాటు చేశారు. సదరు మహిళకు ప్లాట్ రావడంతో ఇల్లు నిర్మించుకుంది. అయితే అధికార పార్టీ నేతలు ఇంటి చూట్టూ ఉన్న ప్లాట్స్ ను కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్లకుండా పొలం చేస్తూ ఇబ్బందులకు గురి చేశారు. దీంతో చేసేదేం లేక సదరు మహిళ ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది. 

చెట్టుకొకరం ఎల్లిపొయినం

వలస వచ్చివారంతా పేద దళితులే. ఇక్కడి లీడర్లు అక్రమంగా కబ్జాలు చేసి గ్రామంలోని రోడ్లు, అభివృద్ధి కోసం వదిలేసిన భూములను కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ కబ్జా చేసి గ్రామాన్ని నామరూపం లేకుండా చేసిండ్లు. అబాది భూమిలో పట్టాలు ఇవ్వొద్దు. కానీ అక్రమంగా పాస్ బుక్ లు పొంది కబ్జాలకు దిగిండ్రు. - చంగల్ గంగారాం, గంగ సముందర్, జగిత్యాల

పొచమ్మ గుడి భూమి కబ్జా చేసిండ్లు 

ఎస్సారెస్పీ ముంపు గ్రామస్తుల కోసం ఇచ్చిన భూములివి. కొందరు అక్రమంగా పాస్ బుక్ లు పొంది కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు అవినీతికి పాల్పడటంతోనే అక్రమాలు జరిగాయి. సర్వే నంబర్ ఒక చోటు ఉండగా, భూమి మరో చోట ఉంటోంది. చివరికి పొచమ్మ గుడి భూమి కూడా కబ్జా చేసి దున్నుతుండ్రు. ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి.
- చింత కృష్ణ బీర్పూర్

ఎస్సారెస్పీ ముంపు గ్రామాల్లో అధికార పార్టీ నేతల కబ్జాలు

 గంగ సముందర్ గ్రామంలో  ఫారెస్ట్ ల్యాండ్ లో లే అవుట్ చేసి 70 కుటుంబాలకు గుంటన్నర ఫ్లాట్, దేవస్థానం, స్కూల్, ఆట స్థలం, పార్కు, శ్మశానం, గ్రామ దేవతల కోసం ఒక్కో ఎకరం, ప్రభుత్వ భవనాలకు రెండు ఎకరాలు, పది ఎకరాల భూముల్లో రోడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం మూడెకరాలు జూనియర్ కాలేజ్, ఎకరం స్కూల్ కోసం కేటాయించిన భూమిలో కొత్తగా ఏర్పడ్డ బీర్పూర్ మండల ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన కొందరు ఖాళీ స్థలాలు, మట్టి రోడ్లు కబ్జా చేయడంతో గ్రామస్తులు ప్రస్తుతం చెట్టుకొకరుగా వెళ్లిపోయారు.