- మృతుడు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు
శామీర్ పేట, వెలుగు : కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ ఘటన శామీర్‌పేట సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జైగిరి గ్రామానికి చెందిన తల్లపల్లి దుర్గాప్రసాద్ (30) వ్యాపార పని మీద హైదరాబాద్‌కు వచ్చాడు.
ఆదివారం రాత్రి మియాపూర్‌లో తన బంధువుల ఇంట్లో ఉండి, సోమవారం ఉదయం 4.30 గంటలకు కారులో బయల్దేరాడు. ఓఆర్ఆర్‌పై శామీర్‌పేట దాటి కీసర వైపు రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగడాన్ని గమనించిన కొందరు శామీర్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని చూసేసరికే కారుతో పాటు దుర్గాప్రసాద్ పూర్తిగా కాలిపోయాడు. కారు పక్కకు నిలిపి నిద్రిస్తుండగా.. ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
