
- పండుగ సీజన్ ముందే అమలైతే బండ్ల అమ్మకాలు పెరుగుతాయంటున్న నిపుణులు
- వెహికల్ ఈఎంఐల భారం తగ్గుతుందని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) రేట్లను తగ్గిస్తే ఆటో ఇండస్ట్రీ ఎక్కువగా లాభపడుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. చిన్న కార్ల ధరలు రూ.80 వేల వరకు, ఎస్‌యూవీల ధరలు రూ.1.1 లక్షల వరకు తగ్గొచ్చని వెల్లడించాయి. చాలామంది కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారని, ధరలు దిగొస్తే వీరు కొనుగోలుకు మొగ్గు చూపొచ్చని తెలిపాయి.
ప్రస్తుతం 28శాతం జీఎస్‌టీ స్లాబ్‌లో ఉన్న వస్తువుల్లో సుమారు 90శాతం వరకు 18శాతం స్లాబ్‌కు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్లపై జీఎస్‌టీ 28శాతం నుంచి 18శాతానికి తగ్గితే, కొత్త కార్ల కొనుగోలుపై వినియోగదారులు భారీగా ఆదా చేయొచ్చు.
బ్రోకరేజ్ సంస్థ నోమురా ప్రకారం, ఈ ప్రతిపాదిత తగ్గింపు ప్రభావం కొన్ని ప్రముఖ మోడళ్లపై స్పష్టంగా కనిపించనుంది. మారుతి సుజుకీ వేగన్ ఆర్, బాలెనో, డిజైర్ వంటి చిన్న కార్లపై ప్రస్తుతం 28% జీఎస్‌టీ పడుతోంది. రేటు తగ్గితే, వీటి ధరలు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు తగ్గే అవకాశం ఉంది. ఎస్‌యూవీల విషయంలో, ప్రస్తుతం 45శాతం ఉన్న జీఎస్‌టీ రేటు 40శాతానికి తగ్గే అవకాశం ఉంది. మారుతి బ్రెజా, హ్యుండాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి మోడళ్ల ధరలు రూ.1.1 లక్షల వరకు దిగొచ్చే
అవకాశం ఉంది.
కీలక సమయంలో..
ఆటో రంగానికి కీలకమైన సమయంలో జీఎస్‌టీ రేట్లను కేంద్రం తగ్గిస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. బండ్ల సేల్స్ పెరగడంలో ఎస్‌యూవీ ముందున్నా, ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూవీ సేల్స్ తప్ప మిగిలిన కంపెనీ అమ్మకాల్లో వృద్ధి కనిపించడం లేదు. మొత్తం ఆటో రంగ వృద్ధి స్థిరంగా ఉండగా, మార్కెట్ షేర్ కోసం పోటీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ధరలు తగ్గడం, ఈఎంఐలు తగ్గడం వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది.
జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో కస్టమర్లపై ఈఎంఐల భారం కూడా దిగిరానుంది. ఉదాహరణకు, మారుతి డిజైర్ ఈఎంఐ రూ.15,519 ఉంటే రూ.14,195కి తగ్గుతుంది. వేగన్ ఆర్, బాలెనో ఈఎంఐలపై రూ.1,000–1,200 వరకు ఉపశమనం దొరుకుతుంది. జీఎస్‌టీ సంస్కరణలతో మధ్య తరగతి వినియోగదారులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. దీంతో పాటు కార్లు మరింతగా అందుబాటులోకి వస్తాయి. ఈఎంఐ తగ్గడం వల్ల కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
ఇది కొత్త కొనుగోళ్లను ప్రోత్సహించి, ఆటో రంగంలో డిమాండ్‌ను తిరిగి పెంచే అవకాశం ఉంది. ఇంకా జీఎస్‌టీ తగ్గింపు పండుగ సీజన్‌కు ముందే అమలవుతుందని అంచనా. దీనివల్ల వినియోగదారులు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. ఆటో డీలర్లు, తయారీదారులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ప్రత్యేక ఆఫర్లు, ఫైనాన్స్ ప్యాకేజీలు అందించొచ్చు. మొత్తంగా జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలో సేల్స్ పెరగనున్నాయి.