కార్ల రేట్లు పైకి!.. ఈ నెల నుంచే పెరగనున్న ధరలు

 కార్ల రేట్లు పైకి!.. ఈ నెల నుంచే  పెరగనున్న ధరలు
  • ఇప్పటికే ప్రకటించిన మారుతి, టాటా మోటార్స్‌‌‌‌, మహీంద్రా అండ్ మహీంద్రా, మరికొన్ని కంపెనీలు

న్యూఢిల్లీ : మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్‌‌‌‌, మరికొన్ని  కంపెనీల కార్లు  ఖరీదుగా మారనున్నాయి.  ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఎక్కువ కావడంతో  ముడిసరుకుల ధరలు పెరిగాయని, అందుకే బండ్ల రేట్లను పెంచుతున్నామని ఈ కంపెనీలు చెబుతున్నాయి. మారుతి సుజుకీ కిందటేడాది ఏప్రిల్‌‌‌‌లో చివరి సారిగా కార్ల రేట్లను 0.8 శాతం పెంచింది. ఈ నెలలో  మరో రౌండ్‌‌‌‌ పెంపు ఉంటుందని గతంలో పేర్కొంది. టాటా మోటార్స్ కూడా జనవరి నుంచే బండ్ల రేట్లను  పెంచుతామని ప్రకటించగా, ఎంత మేర పెంచుతామనేది బయట పెట్టలేదు.

ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్ల రేట్లను కూడా పెంచనుంది. ఆడి  తన కార్ల రేట్లను 2 శాతం వరకు పెంచాలని చూస్తోంది. ఈ నెల నుంచి ఇది అమల్లోకి రానుంది. మహీంద్రా తన ఎస్‌‌‌‌యూవీలపై రేట్లు పెంచనుంది. హ్యుందాయ్‌‌‌‌, ఎంజీ మోటార్‌‌‌‌‌‌‌‌  కూడా బండ్ల రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నాయి. బీఎండబ్ల్యూ, ఫోక్స్‌‌‌‌వ్యాగన్‌‌‌‌, స్కోడా, మెర్సిడెజ్ బెంజ్‌‌‌‌, వోల్వో, నిస్సాన్‌‌‌‌, హోండా కార్ల ధరలు ఈ నెల నుంచే పెరిగే అవకాశం ఉంది. ఈ కంపెనీలు 2–3 శాతం మేర ధరలు పెంచనున్నాయి.