అమెరికా వీసా రూల్స్ ఎఫెక్ట్: హైదరాబాద్, బెంగళూరుపై గ్లోబల్ బ్యాంక్స్ ఫోకస్, కొత్త జాబ్స్ రెడీ..

అమెరికా వీసా రూల్స్ ఎఫెక్ట్: హైదరాబాద్, బెంగళూరుపై గ్లోబల్ బ్యాంక్స్ ఫోకస్, కొత్త జాబ్స్ రెడీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన H-1B వీసా పరిమితుల తర్వాత అమెరికాలోని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు భారత్‌ను కొత్త గమ్యస్థానంగా చూస్తున్న ధోరణి పెరుగుతోంది. దీంతో దిగ్గజ బ్యాంకర్లైన జేపీ మోర్గన్, గోల్డ్ మాన్ శాక్స్, కేకేఆర్ అండ్ కొ, మిలీనియం మేనేజ్మెంట్ వంటి వాల్ స్ట్రీట్ దిగ్గజాలు తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(GCCs) ద్వారా భారత్‌లో టీమ్స్‌ను విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాయి. 

ఈ మార్పు ప్రధానంగా అమెరికా వర్క్ వీసాలపై పెరిగిన రుసుములు, కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ అనుమతి(EAD) పరిమితులు, అధిక పర్యవేక్షణా నిబంధనల వల్ల వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి H-1B ఉద్యోగికి సంస్థలు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి రావటంతో అమెరికన్ కంపెనీలకు భారంగా మారటం వల్ల తక్కువ వ్యయంతో ఉన్న భారత ప్రతిభను ఉపయోగించుకునే దిశగా ప్రత్యామ్నాయాలను ప్లాన్ చేస్తున్నాయి కంపెనీలు. 

ప్రస్తుతం బెంగళూరులో జేపీ మోర్గన్ క్రెడిట్ సపోర్ట్ స్పెషలిస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రారంభించింది. వీరు రుణ ఒప్పందాల్లో ఉల్లంఘనలను పర్యవేక్షిస్తారు. అదే సమయంలో గోల్డ్ మాన్ శాక్స్ వివిధ ఆస్తుల రుణ సమీక్షలకు అసోసియేట్స్ కోసం వెతుకుతోంది. ముంబైలో KKR తన పోర్ట్‌ఫోలియో కంపెనీల పర్యవేక్షణ టీమ్ విస్తరిస్తుండగా.. మిలీనియం మేనేజ్మెంట్ తన డెరివేటివ్స్ ట్రేడింగ్ రిస్క్ అనలిస్ట్‌లను నియామకాలపై ఫోకస్ పెట్టింది. 

ALSO READ : బెంగళూరు వదిలి వెళ్లిపోయేందుకు స్టార్టప్ కంపెనీలకు భారీ ఆఫర్లు..

అమెరికా కంపెనీలు ఇండియన్ నగరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కేవలం ఆర్థిక, రిస్క్ మేనేజ్‌మెంట్ ప్రక్రియలను కొనసాగించడం మాత్రమే కాకుండా.. రీసెర్చ్, ఐటీ అభివృద్ధి, అకౌంట్ మేనేజ్మెంట్ వంటి విభాగాలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్నాయి. 

ఇవి అమెరికా కంపెనీలకు తక్కువ వ్యయంతో ఉన్న  నైపుణ్యాన్ని పొందడమే కాకుండా, భవిష్యత్ నియామకాలకు టాలెంట్ అందుబాటులో ఉండేలా చేస్తోంది. అందువల్లనే వీసా పరిమితుల కారణంగా తమ హెడ్ ఆఫీసులతో సెంటర్ల విస్తరణపై చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. ఈ పరిణామాలు భారత్‌ను ప్రపంచ ఆర్థిక ఆపరేషన్లకు కేంద్రముగా నిలబెట్టే దిశగా మారుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.