ఆసిఫాబాద్ గడ్డ అందాలకు అడ్డ

ఆసిఫాబాద్ గడ్డ అందాలకు అడ్డ

జల్​... జంగల్... జమీన్ నినాదంతో నిజాం సైన్యంతో పోరాడిన గోండు వీరుడు కొమ్రం భీం పుట్టిన నేల ఆసిఫాబాద్. ఈ ప్రాంతంలో అడవి తల్లినే నమ్ముకుని బతికే గిరిజన కుటుంబాలు చాలానే. పచ్చదనం.. ఎత్తైన కొండలు, గుట్టలు.. వాటి మధ్యలో జాలువారే అందాల జలపాతాలు... ఇవన్నీ చూడాలంటే  కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లాల్సిందే. వీకెండ్స్​లో ఇక్కడికి వెళ్తే ప్రకృతి ఒడిలో సేదతీరొచ్చు. 

ప్రకృతి ఒడిలో సేదతీరాలి అనుకునేవాళ్లకు  మిట్టపల్లి జలపాతం బెస్ట్​ ఛాయిస్​. లింగాలపూర్ మండలంలోని పిట్టలగూడ ఊళ్లో ఉంది. కొండల మధ్య జాలువారే ఈ జలపాతాన్ని ‘సప్తగుండాల జలపాతం’ అని కూడా అంటారు. కారణం... ఇది ఏడు జలపాతాలు కలిసి ఏర్పడింది. వీటిలో మూడు జలపాతాల్ని రాముడు, సీత, భీముడు అనే పేర్లతో పిలుస్తారు అక్కడివాళ్లు. దొంతరలుగా పేర్చినట్టు ఉన్న రాళ్ల మీద నుంచి దుమికే జలపాతాన్ని చూడాలంటే మూడు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. అక్కడికి వెళ్లే దారంతా పంటపొలాలు,  కొండలు, చెట్లతో రమణీయంగా ఉంటుంది. మిట్ట జలపాతం ఆసిఫాబాద్​ నుంచి 100 కిలోమీటర్ల  దూరంలో ఉంది.  

సవతుల గుండం వాటర్​ ఫాల్
ఆసిఫాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జలపాతం. ఇక్కడ 150 మీటర్ల ఎత్తు నుంచి నీళ్లు కిందకు దూకుతాయి. ఈ జలపాతం నీళ్లు గోదావరి నదిలో కలుస్తాయి. ఇక్కడికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. 

గంగాపూర్ గుడి
ఈ జిల్లాలోని పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. ఈ గుడి వెనక ఒక కథ ప్రచారంలో ఉంది. అదేంటంటే... ముమ్మడి పోతాజీ అనే వేంకటేశ్వర స్వామి భక్తుడు ప్రతి ఏడాది తిరుపతికి వెళ్లేవాడట. ముసలితనంలో ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఒక ఏడాది తిరుపతి వెళ్లలేదట. అప్పుడు వేంకటేశ్వరుడు పోతాజీ కలలో కనిపించి ‘కొండను తవ్వితే నేను దర్శనమిస్తాను’ అని చెప్పాడట. అలా వేంకటేశ్వర స్వామి గుడి అక్కడ కట్టారు. ప్రతి ఏడాది మాఘ పౌర్ణమికి ఈ దేవాలయంలో మూడు రోజులు  కన్నులపండువగా జాతర జరుగుతుంది. 

జోడెఘాట్ మ్యూజియం
అడవిపై ఆదివాసీల హక్కు కోసం పోరాడిన కొమ్రం భీం ఆనవాళ్లని చూడాలంటే జోడెఘాట్​ మ్యూజియానికి వెళ్లాలి. 12 గ్రామాల ప్రజల తరఫున నిజాం సైన్యంతో  పోరాటం చేసిన కొమ్రం భీం చనిపోయింది ఇక్కడే. ఆయన పోరాటం ఎట్ల చేశాడో ఈకాలం పిల్లలకు తెలియజేయాలని ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. మ్యూజియం ముంగట జల్, జంగల్, జమీన్ ఆర్చ్​ని, కొమ్రం భీం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో అడుగడుగునా అక్కడి గిరిజనుల వారసత్వ ఆనవాళ్లు కనిపిస్తాయి. వాళ్లు వేటాడేందుకు వాడే వస్తువులు, దండారీ వేడుకలో ముఖానికి పెట్టుకునే మాస్క్​లు, చచోయ్​, గుమెలా వంటి సంగీత వాయిద్యాల్ని చూడొచ్చు. గుసాడీ నృత్యం గురించి, ఆదివాసీలు  పూజా పద్ధతుల గురించి తెలుసుకోవచ్చు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మ్యూజియం తెరుస్తారు. ఎంట్రీ ఫీజు ఉండదు. 

కెరమెరి ఘాట్
పచ్చని చెట్లు, పంటపొలాలు, వంపులు తిరిగి ఉండే ఘాట్ రోడ్డు జర్నీని ఎంజాయ్ చేయాలంటే కెరమెరి ఘాట్స్​కి వెళ్లాలి. ఇక్కడ కెరమెరి కొండల్ని చూడొచ్చు. అసిఫాబాద్ నుంచి ఉట్నూర్​కు వెళ్లే  దారిలో కెరమెరి ఘాట్​ ఉంటుంది. ఆరు కిలోమీటర్ల ఈ జర్నీ  థ్రిల్లింగ్​గా ఉంటుంది. వర్షాకాలంలో చుట్టూ పచ్చదనంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాచ్​టవర్ ఎక్కితే చుట్టుపక్కల కొండలన్నీ చూడొచ్చు.  

 రాబందుల శాంక్చురీ
అంతరించిపోయే దశలో ఉన్న రాబందుల్ని ఆసిఫాబాద్​లో చూడొచ్చు. బెజ్జూర్ రిజర్వ్​ ఫారెస్ట్​లో పెద్దవాగుకు ఆనుకొని పాలరాపు గుట్ట ఉంటుంది. ఈ గుట్టని ‘రాబందుల శాంక్చురీ’గా మార్చారు. మన   రాష్ట్రంలో రాబందుల ఎక్కువగా ఉండే ప్లేస్​ ఇదే. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాబందుల కోసం చనిపోయిన జంతువుల్ని ఈ కొండ దగ్గర పడేస్తారు. 
ఇలా వెళ్లాలి
ఆదిలాబాద్ నుంచి 119 కిలోమీటర్ల దూరంలో ఉంది కొమ్రం భీం ఆసిఫాబాద్. హైదరాబాద్ నుంచి దాదాపు 306 కిలోమీటర్ల జర్నీ.