కారు చివర్ల ల్యాండైన హెలికాప్టర్​ను చూసిన్రా! 

కారు చివర్ల ల్యాండైన హెలికాప్టర్​ను చూసిన్రా! 

 

  • స్విమ్మింగ్​పూల్​, హెలిప్యాడ్​తో ‘ది అమెరికన్​ డ్రీమ్​’
  • ప్రపంచంలోనే పొడవైన కారుకు కొత్త హంగులు

కారంటే నాలుగు చక్రాలు.. నాలుగు సీట్లు.. ఒక డిక్కీ.. 15 అడుగుల పొడవు.. సుఖూన్​ జర్నీ.. అంతేనా! ఇగో ఈ కారు గురించి తెలిస్తే అంతకన్నా ఎక్కువే అంటరు. చూసేందుకు రైలు అంత పొడవున్న ప్రపంచంలోనే పొడవైన కారిది. పేరు ‘ది అమెరికన్​ డ్రీమ్​’. 100 అడుగుల పొడవుండే ఈ కారును రెండు భాగాలుగా తయారు చేసిన్రు. దీని స్పెషాలిటీ అక్కడితో ఆగిపోలే. ఇప్పటికే గిన్నీస్​ రికార్డు కూడా ఉన్న ఈ కారులో ఈ మధ్యనే మరిన్ని హంగులను చేర్చారు. ఓ స్విమ్మింగ్​పూల్​ను ఏర్పాటు చేసిన్రు. హెలికాప్టర్​ దిగడానికి హెలిప్యాడ్​ను పెట్టిన్రు. జర్నీ సుఖూన్​గానే కాదు.. ఎంజాయ్​ చేస్కుంట పోవచ్చు. బోర్​ కొడితే ఈత కొట్టొచ్చు.. కార్ల పెట్టిన బాత్​ టబ్​లలో జలకాలాడొచ్చు. గోల్ఫ్​ ఆడుకోవచ్చు. అలసిపోతే హాయిగా పండుకుని రెస్ట్​ తీసుకోవచ్చు. టీవీల్లో సినిమాలు చూడొచ్చు. రెండు తలకాయల పాము లెక్క ముందల్కెల్లి.. ఎన్కలకెల్లి ఎటంటే అటు తోల్కుంట పోవచ్చు. చెప్పుకుంట పోతే ఇంక మస్తుమస్తు స్పెషాలిటీలున్నయి ఈ కార్ల. 1986లో మొదటిసారి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బర్బాంక్​లోని జే ఓర్బర్గ్​ అనే సంస్థ.. 1976 నాటి కాడిలాక్​ ఎల్డొరాడో లిమెజీన్​​ఆధారంగా ఈ కారుకు రూపమిచ్చింది. అప్పట్లో జస్ట్​ 60 అడుగుల పొడవు, 26 గిల్లలతోటి దానిని తయారు చేసింది. ముందల, ఎన్కల రెండు వీ8 ఇంజన్లను పెట్టింది. 

ఇట్ల రీస్టోర్​ అయింది

ఓ ఆన్​లైన్​ సైట్​లో దానిని కార్​ఓనర్​ అమ్మకానికి పెట్టడంతో.. ఆటోసియమ్​ అనే మ్యూజియం ఓనర్​ మైకేల్​ మ్యానింగ్​ దానిని కొన్నడు. వాస్తవానికి అతడు చాలా తక్కువ పైసలు ఇస్తననే సరికి ముందుగాల వాళ్లు ఇవ్వమన్నరు. తర్వాత డెజర్లాండ్​ పార్క్​ కార్​ మ్యూజియంతో కలిసి మంచి ధరనే ఇచ్చి సొంతం చేస్కున్నరు. అప్పట్నుంచి ఆ కారును మళ్లా కొత్తదానిలా తయారు చేయడానికి కష్టపడ్డరు. 100 అడుగులకు పెంచి రీస్టోర్​ చేసిన్రు. దాదాపు మూడేండ్లు సుమారు రూ.1.91 కోట్లు (2.5 లక్షల డాలర్లు) ఖర్చు పెట్టి సకల సౌకర్యాలతో దానికి జీవం పోసిన్రు. అంత పొడవైన కారును మూలల్లో మలపాలంటే కష్టం కదా. అందుకనే రెండు భాగాలుగా తయారు చేసి.. రైలు పెట్టెల్లాగా జాయింట్​ చేసిన్రు. ఈ కార్ల 75 మంది ప్రయాణం చేయొచ్చు. అలాగని ఈ కారు రోడ్డు మీద రయ్యుమని దూస్కపోతదని.. ఎక్కాలని అనుకున్నా కుదిరే పని కాదు. ఎందుకంటే దానిని డెజర్లాండ్​ పార్క్​లోని కార్ల మ్యూజియంలోనే జనం చూసేందుకు షో కేస్​లా మాత్రమే పెడ్తున్నరు మరి.