
కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిత్రాలతో నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయమైన మూవీ ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. మనోజ్ చంద్ర, మోనికా లీడ్ రోల్స్‌లో నటించారు.
రానా దగ్గుబాటి సమర్పణలో గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి కలిసి నిర్మించారు. ఇవాళ (జులై 18న) ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు విలేజ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ కొత్తపల్లిలో ఒకప్పుడు ఎలా ఉంది? కేరాఫ్ కంచరపాలెం లాంటి ఎమోషనల్ ఫీల్ ఇచ్చిందా? లేదా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
1997లో కొత్తపల్లి అనే ఓ మారుమూల గ్రామంలో కథ మొదలవుతుంది. ఈ ఊరిపెద్ద రెడ్డి (బెనర్జీ). రెడ్డి కొడుకు భూస్వామి అప్పన్న (రవీంద్ర విజయ్). ఈ కొత్తపల్లి ప్రజలకు అప్పన్న అప్పులిచ్చి వడ్డీకి, చక్రవడ్డీ వేసి టార్చర్ పెడుతుంటాడు. అప్పన్న చేసే పనులు తన తండ్రి రెడ్డికి ఏ మాత్రం నచ్చవు.
అప్పన్న దగ్గర పని చేస్తూ, రికార్డింగ్ డాన్సులు ఆడించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామకృష్ణ (మనోజ్ చంద్ర) ఉంటాడు. రామకృష్ణ ఆ ఊరిపెద్ద రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక టి)ని ప్రేమిస్తాడు. తన ప్రేమను దక్కించుకోవడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తాడు. ఈ క్రమంలో మరో అమ్మాయి అందం (ఉషా బోనెల) హెల్ప్ అడుగుతాడు. కానీ, సహాయం కోరిన అమ్మాయి 'అందంతో'నే రామకృష్ణ మ్యారేజ్ అయ్యేలా ఆ కొత్తపల్లి గ్రామ పంచాయితీ తీర్మానిస్తుంది.
తాను ప్రేమించింది సావిత్రినని తెల్సి కూడా అందంతో పెళ్లి అనే ముచ్చట ఎందుకొచ్చింది? రామకృష్ణకు అప్పన్న ఎందుకు సహాయం చేయాలనుకుంటాడు? రామకృష్ణకు సహాయం చేద్దామనుకున్న అప్పన్నకు ఏమైంది? సహాయం చేసిన తర్వాత అప్పన్నకు ఏమైంది?
చివరికి రామకృష్ణ.. ఊరిపెద్ద 'రెడ్డి' గారి మనవరాలిని పెళ్లి చేసుకున్నాడా? లేక వారి ఇంట్లో పని చేసే అందాన్ని చేసుకున్నాడా? చివరగా వడ్డీలకి చక్రవడ్డీలు వేస్తూ జలగలా పీల్చిన అప్పన్న ఊరి జనాలకి దేవుడు ఎలా అయ్యాడు? వంటి విషయాలు తెలియాలంటే కొత్తపల్లిలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
కేరాఫ్ కంచరపాలెం మూవీ ఎలాంటి వైవిధ్యత చాటుకుందో అందరం చూశాం. ఆశా పాశం, ఏమి జన్మను వంటి సాంగ్స్ కి ఆడియన్స్ మొత్తం ఫిదా అయ్యారు. అంతటి గొప్ప సినిమా తీసిన ప్రొడ్యూసర్ నుంచి విలేజ్ డ్రామా వస్తుండటంతోనే అంచనాలు మొదలయ్యాయి. కేరాఫ్ కంచరపాలెం చూసిన ప్రతి ఆడియన్ ఈ సినిమా చూడలని ముందు నుంచే అనుకుని ఉంటారు. అయితే, ఆ సినిమాలో ఓ వ్యక్తి జీవితంలోని నాలుగు కథలను చెబుతుంది. ఈ కొత్తపల్లిలో సినిమా గ్రామాల్లోని సామాజిక, రాజకీయ స్థితిగతులు, విశ్వాసాల్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది.
ఫస్టాఫ్‌లో పెద్దగా కథ లేకుండా రూరల్ బ్యాక్‌డ్రాప్ సీన్లతో బాగానే నడిపించారు. స్లోగా మొదలైనా కూడా, కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ‘దేవుడంటే నిజమో అబద్ధమో కాదు.. నమ్మకం’ అనే వంటి డైలాగ్స్ సైతం మెప్పిస్తాయి.
సెకండాఫ్ లో కథలో వేగం పెరిగి సహజమైన గ్రామీణ కథ కాస్తా.. ఆసక్తిరేపే థ్రిల్లర్ గా మారుతుంది. చివర్లో అప్పన్నని దేవుడిగా మార్చే సీన్స్, నమ్మకాన్ని నాశనం చేయాలని హీరో చేసే ప్రయత్నం ఇంకా బలంగా చెప్పుంటే బాగుండేది. ఓవరాల్‌గా కొత్తపల్లిలో ఒకప్పుడు ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే:
రామకృష్ణ పాత్రతో మనోజ్ చంద్ర మెప్పించాడు. కొత్తవాడే అయిన తనకొచ్చిన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. రవీంద్ర విజయ్, అప్పన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. తన పాత్రలోని విభిన్నశైలిని చూపించి మరోసారి శభాష్ అనిపించుకున్నాడు. అందం పాత్రలో ఉషా బోనెల, సావిత్రిగా మోనిక బాగా నటించారు. రెడ్డి పాత్రలో బెనర్జీ తన వెర్సటాలిని చూపించాడు. దర్శకురాలు ప్రవీణ ఓ టఫ్ లేడీ క్యారెక్టర్ చేసింది. తన పాత్రలో వచ్చే రెండు అద్భుతమైన సీన్స్ మెప్పిస్తాయి.