
పారిస్: డిఫెండింగ్ చాంపియన్స్ ఇగా స్వైటెక్, సూపర్ ఫామ్‌లో ఉన్న కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తమ టైటిళ్లను నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశారు. సోమవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఐదో సీడ్ స్వైటెక్ (పోలాండ్) 6-–3, 6–-3తో 42వ ర్యాంకర్ రెబెకా స్రామ్కోవా (స్లొవేకియా)ను ఓడించింది. గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఇకా 25 విన్నర్లు కొట్టి, 17 అనవసర తప్పిదాలు చేసింది.
ఇతర మ్యాచ్‌ల్లో బ్రిటన్ స్టార్ ఎమ్మా రదుకాను 7–-5, 4–-6, 6–-3తో చైనా ప్లేయర్ జిన్యు వాంగ్‌పై పోరాడి గెలిచింది. కానీ, అమెరికాకు చెందిన 9వ సీడ్ ఎమ్మా నవారో 0-–6, 1–-6 తో జెస్సికా బౌజాస్ మనీరో (స్పెయిన్) చేతిలో అనూహ్యంగా చిత్తయింది. మెన్స్ సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) 6–-3, 6–-4, 6-–2తో ఇటాలీ క్వాలిఫయర్ గియులియో జెప్పియెరీపై సునాయాస విజయం సాధించాడు.
కాస్పర్ రూడ్ (నార్వే) 6–-3, 6–-4, 6–-2తో ఆల్బర్ట్ రామోస్ -వినోలాస్ (స్పెయిన్)ను, గ్రీస్ స్టార్ స్టెఫనోస్ సిట్సిపాస్ 7–-5, 6-–3, 6–-4తో టోమస్ మార్టిన్ (అర్జెంటీనా)ను ఓడించారు. కానీ, అమెరికాకు చెందిన నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌కు నిరాశ ఎదురైంది. అతను 5-–7, 6–-3, 3-–6, 1-–6తో జర్మనీకి చెందిన డానియల్ అల్ట్‌మేయర్ చేతిలో ఓడిపోయాడు.