కార్లు పెద్దగా అమ్ముడుపోవట్లే!

కార్లు పెద్దగా అమ్ముడుపోవట్లే!

కార్ల అమ్మకాలు నిరాశపరిచాయి. 2018–19 కాలానికి అమ్మకాలు కేవలం 2.7 శాతమేపెరిగాయి. డబ్బు కొరత, పెరిగిన వాహనాల ధరలు,ఎన్నికల ముందున్న అనిశ్చితి వంటివాటితో కస్టమర్లలో సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో అమ్మకాలకు బ్రేకులు పడ్డాయి. సోమవారం విడుదలైన సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండి యన్ ఆటోమొబైల్ మానుఫ్యాక్చరర్స్) డేటా ప్రకారం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2018–19 కాలానికి 33,77,436కాగా, 2017–18 కాలానికి 32,88,581 యూనిట్లు అమ్ముడయ్యాయి. కిందటి ఏడాదితో పోలిస్తే 2.7శాతం మాత్రమే వృద్ధిని సాధించింది. కొత్త వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ ద్వితీయార్థంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. దీంతో పరిశ్రమ వర్గాలు వృద్ధి అంచనాలను 8–10శాతం నుండి 6 శాతానికి తగ్గించినప్పటికీ, ఆ అంచనాలకు కూడా అందుకోలేకపోయాయి.

దేశీయకార్ల అమ్మకాలు 2018–19లో 22,18,549 కాగా,అంతకుముందు ఏడాది 21,74,024 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక యుటిలిటీ వాహనాల అమ్మకాలు 2.08 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు మాత్రం 9.64 శాతంక్షీణించాయి. గతేడాది నగదు కొరత, ఇన్సూరెన్స్ ప్రారంతో పాటు పెరిగిన కమోడిటీ ధరలవంటి పలుసవాళ్ల కారణంగా అమ్మకాలు తగ్గాయని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వదేరా తెలిపారు. సాధారణ ఎన్నికలు, కొత్త ఎమిషన్స్ వంటి కారణాలతో ఈ ఏడాదికూడా ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి ఉండకపోవచ్చని, 3–5 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. కొత్త ఎమిషన్ కంటే ముందు కొంత ముందస్తు కొనుగోళ్లు ఉండవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు వదేరా చెప్పారు.

అత్యధికంగా మారుతీ సుజుకీ 5.25 శాతం వృద్ధిచెందగా, మహీంద్రా అండ్ మహీంద్రా 2.21శాతం, హ్యుందాయ్ 1.68 శాతం వృద్ధి చెందాయి. ఇక టూవీలర్ అమ్మకాలు 4.86 శాతం పెరగగా, వాణిజ్యవాహనాల అమ్మకాలు 17.55 శాతం ఎగబాకాయి.2019–20 ఆర్థిక సంవత్సరానికి టూ వీలర్ అమ్మకాలు 5–7 శాతం, వాణిజ్య వాహనాలు 10–12శాతం, త్రీ వీలర్ అమ్మకాలు 7–9 శాతం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో వాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్యాసింజర్ వాహనాలు 2.96 శాతం, కార్ల అమ్మకాలు 6.87శాతం, టూ వీలర్ అమ్మకాలు 17.31 శాతం తగ్గాయి.

జీఎస్టీ తగ్గిస్తేనే..
ప్యాసింజర్ వాహనాలు, టూవీలర్స్‌‌పై ఉన్న28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని కోరుతూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ప్రభుత్వాన్నిఆశ్రయించింది. సేఫ్టీ రెగ్యులేషన్స్, కొత్త ఎమిషన్స్‌‌లతో ధరలు 10 శాతం నుంచి 15 శాతానికిపెరిగే అవకాశాలున్నాయని ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ధరల పెరుగుదల తమ ప్రొడక్ట్‌‌లపై ప్రభావం చూపనుందని పేర్కొంటోంది. అదనపు సెస్ 1 శాతం నుంచి15 శాతంతో ఆటోమొబైల్స్‌‌పై ప్రస్తుతం 28శాతం జీఎస్టీ ఉంది. ఒకవేళ డిమాండ్‌‌ తగ్గితే, ప్రభుత్వానికి పన్ను వసూళ్లు కూడా తగ్గుతాయని చెప్పింది. ఈ క్రమంలో ఆటోమొబైల్స్‌‌ పై జీఎస్టీ 18 శాతానికి తగ్గించాలని సియామ్కోరుతోంది.