IND vs ENG 2025: మూడు పల్టీలు కొట్టిన స్టంప్: ఆర్చర్ ఇన్ స్వింగ్ ధాటికి పంత్ క్లీన్ బౌల్డ్

IND vs ENG 2025: మూడు పల్టీలు కొట్టిన స్టంప్: ఆర్చర్ ఇన్ స్వింగ్ ధాటికి పంత్ క్లీన్ బౌల్డ్

లార్డ్స్ టెస్టులో టీమిండియా కీలకమైన రిషబ్ పంత్ వికెట్ కోల్పోయింది. 193 పరుగుల ఛేజింగ్ లో కేవలం 9 పరుగులే చేసి పంత్ పెవిలియన్ కు చేరాడు. ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 21 ఓవర్ ఐదో బంతికి పంత్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్చర్ ఇన్ స్వింగ్ పంత్ ఆడేలోపు వికెట్లను గిరాటేసింది. స్వింగ్ కు వేగం కూడా తోడవ్వడంతో స్టంప్ మూడు పల్టీలు కొట్టింది. దీంతో టీమిండియా 71 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. 

4 వికెట్ల నష్టానికి 58 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ప్రస్తుతం 83 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. పంత్ తర్వాత వరుసగా రాహుల్, సుందర్ పెవిలియన్ కు క్యూ కట్టారు. స్టోక్స్ ఇన్ స్వింగ్ డెలివరీతో రాహుల్ (39) ను ఔట్ చేయగా.. ఆర్చర్ బౌలింగ్ లో సుందర్ (0) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ విజయానికి మరో 106 పరుగులు కావాలి. మరోవైపు ఇంగ్లాండ్ గెలవాలంటే చివరి 3 వికెట్లు తీయాలి. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న జడేజా, నితీష్ పైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్, కార్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. 

Also Read:- మితిమీరిన సెలెబ్రేషన్.. టీమిండియా పేసర్‌కు ఫైన్‌తో పాటు డీ మెరిట్ పాయింట్

మన బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో  కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇండియా ముందు 193 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచగలిగింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో రాహుల్ (39) యశస్వి జైస్వాల్ (0), కెప్టెన్ గిల్ (6), కరుణ్ నాయర్ (14), పంత్ (9), సుందర్ (0) విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 387 పరుగులు చేయగా.. ఆతర్వాత ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది.